China spy balloon: చైనా నిఘా బెలూన్ తో అమెరికా రక్షణశాఖ పైలట్ సెల్ఫీ!

  • నిఘా బెలూన్ ను ఆకాశంలో విమానంలోంచి ఫొటో తీసిన పైలట్
  • విడుదల చేసిన అమెరికా రక్షణ శాఖ
  • మోంటానాలో 60 వేల అడుగుల ఎత్తులో తీసినట్లు సీఎన్ఎన్ రిపోర్ట్
US spy plane pilot takes selfie while flying over Chinese balloon

చైనాకు చెందిన నిఘా బెలూన్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అమెరికాలో ఈ బెలూన్లు కనిపించగా.. వాటిని మిసైళ్లు ఉపయోగించి కూల్చేశారు. తాజాగా చైనా నిఘా బెలూన్లకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటపడింది. 

అమెరికా రక్షణ శాఖ బుధవారం (అక్కడి కాలమానం ప్రకారం) ఓ ఫొటోను విడుదల చేసింది. చైనా నిఘా బెలూన్ పై నుంచి వెళ్తుండగా ఎయిర్ ఫోర్స్ పైలట్ తీసిన ఫొటో ఇది. యూ-2 నిఘా విమానం కాక్ పిట్ నుంచి ఈ ‘సెల్ఫీ’ తీశారు. అమెరికాలోని మోంటానాలో దాదాపు 60 వేల అడుగుల ఎత్తులో ఈ ఫొటో తీసినట్లు సీఎన్ఎన్ సంస్థ వెల్లడించింది. 

‘‘అలస్కాలో అమెరికా గగనతలంలోకి నిఘా బెలూన్ ప్రవేశించిన వారం రోజుల తర్వాత ఈ సెల్ఫీ తీశాం. బెలూన్ ను ట్రాక్ చేసేందుకు యూ-2 నిఘా విమానం పంపాం. అప్పుడే పైలట్ విమానంలో నుంచి ఫొటో తీశాడు’’ అని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

నిజానికి నిఘా బెలూన్ ను గుర్తించిన వెంటనే కూల్చేయలేదని అమెరికా మిలిటరీ అధికారులు చెప్పారు. భారీ పరిమాణంలో ఉండటం, అందులో ఏమున్నాయో తెలియకపోవడంతో పౌరుల భద్రత ద‌ృష్ట్యా ఆచితూచి వ్యవహరించినట్లు చెప్పారు. తర్వాత ఫిబ్రవరి 4న అట్లాంటిక్ సముద్రంపై కూల్చేసినట్లు తెలిపారు. బెలూన్ శిథిలాలను సేకరించి విశ్లేషిస్తున్నట్లు వివరించారు.

నిఘా బెలూన్ల ఘటనపై అమెరికా తీవ్రంగా మండిపడింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించింది. దీంతో అతిగా స్పందిస్తున్నారంటూ చైనా కౌంటర్ ఇచ్చింది. కేవలం వాతావరణ సంబంధిత వివరాలను సేకరించేందుకే బెలూన్ పంపినట్లు చెప్పుకొచ్చింది.

More Telugu News