Hyderabad: వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి.. హైదరాబాద్ లో దారుణం.. వీడియో ఇదిగో !

  • ఆదివారం తండ్రి పనిచేసే చోటుకు వెళ్లిన బాలుడు.
  • ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా దాడి చేసిన శునకాలు
  • కింద పడేసి, లాక్కెళ్లిన కుక్కలు.. తప్పించుకునేందుకు బాలుడి విఫలయత్నం
  • సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసి చలించిపోతున్న నెటిజన్లు
Five year old Boy Dies In Stray Dogs Attack In Hyderabad

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఐదేళ్ల బాలుడిపైన కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా వెళుతున్న బాలుడిపైకి ఎగబడ్డాయి. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా కిందపడేసి, నోట కరిచి లాక్కెళ్లాయి. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. అంబర్ పేట్ లో ఆదివారం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దయనీయ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుక్కలు దాడి చేస్తుంటే తప్పించుకునేందుకు ఆ బాలుడు చేసిన ప్రయత్నం చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంబర్ పేట్ కు చెందిన ఐదేళ్ల బాలుడు ప్రదీప్ ఆదివారం తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే చోటుకు వెళ్లాడు. కాసేపటికి తండ్రి తన పనిలో నిమగ్నం కావడంతో అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో వీధి కుక్కలు ప్రదీప్ ను చుట్టుముట్టాయి. మూడు కుక్కలు దాడి చేస్తుండడంతో ప్రదీప్ భయాందోళనలకు గురయ్యాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా కుక్కలు విడిచిపెట్టలేదు. కిందపడేసి ప్రదీప్ ను లాక్కెళుతూ దాడి చేశాయి.

ప్రదీప్ తండ్రి అక్కడికి పరిగెత్తుకు వచ్చేలోపే తీవ్రంగా గాయపరిచాయి. ప్రదీప్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ప్రదీప్ అప్పటికే చనిపోయాడని చెప్పారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా, వీధి కుక్కల దాడిలో ప్రదీప్ చనిపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కల బారి నుంచి కాపాడాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More Telugu News