Fever: జ్వరం వచ్చిన వెంటనే పిల్లలకు పారాసెటమాల్ ట్యాబ్లెట్లు వేసేస్తున్నారా?.. ఇకపై అలా చేయొద్దు!

  • కొద్దిపాటి జ్వరానికే మందులు వాడడం సరికాదంటున్న పరిశోధకులు
  • ట్యాబ్లెట్ వేసి శరీరాన్ని చల్లబరిచినంత మాత్రాన రోగం నయమైనట్టు కాదని స్పష్టీకరణ
  • అదే పనిగా మాత్రల వినియోగం వల్ల దుష్ఫలితాలు వస్తాయని హెచ్చరిక
Often using fever tablets for children is not good to health

ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పారాసెటమాల్ మాత్రలు నిల్వ ఉంచుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు ఎవరికైనా సరే కాస్తంత జ్వరంగా అనిపించినా, నొప్పులుగా ఉన్న వెంటనే ఓ మాత్రను గుటుక్కున మింగేస్తున్నారు. పెద్దల సంగతి పక్కనపెడితే 12 ఏళ్లలోపు పిల్లలకు అదే పనిగా పారాసెటమాల్ ట్యాబ్లెట్ల వాడకం అంతమంచిది కాదని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని మిచిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. పిల్లల శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ లోపే ఉన్నా ప్రతి ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు ఈ ట్యాబ్లెట్లు వేస్తున్నట్టు వారి అధ్యయనంలో తేలింది. 100.4 డిగ్రీల నుంచి 101.9 డిగ్రీల లోపు ఉంటే ప్రతి ఇద్దరు తల్లిదండ్రుల్లో ఒకరు జ్వరం మాత్రలు వాడుతున్నారు.

అలాగే, జ్వరం మళ్లీ రాకుండా ఉండేందుకు ప్రతి నలుగురిలో ఒకరు రెండో డోసు ఇస్తున్నట్టు వారి పరిశోధనలో తేలింది. అయితే, ఈ మాత్రం జ్వరానికి బెంబేలెత్తిపోయి మాత్రలను వాడడం సరికాదని, ఇలాంటి జ్వరాలను వాటంతట అవే తగ్గనివ్వాలని సూచించారు. రోగంపై పోరాడే క్రమంలో వారి శరీరం వెచ్చబడుతుందని, మాత్ర ద్వారా శరీరాన్ని చల్లబరిచినంత మాత్రాన రోగం నయమైనట్టు కాదని చెబుతున్నారు. 

ఇలా చీటికిమాటికి మందులు వాడడం వల్ల అది దుష్ఫలితాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే, థర్మామీటర్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టి చూడడం వల్ల కచ్చితమైన ఫలితాలు రావని, నుదుటి మీద, చెవిలో సరైన పద్ధతిలో థర్మామీటర్‌ను వాడితే మాత్రమే కరెక్ట్ ఫలితాలు వస్తాయన్నారు.

More Telugu News