Alexandrine parakeets: హోం టూర్ వీడియోలో కనిపించిన చిలుకలు.. నటుడు రోబో శంకర్‌కు రూ. రెండున్నర లక్షల జరిమానా!

Actor Robo Shankar fined Rs 250000  for keeping Alexandrine parakeets at home
  • నటుడిని చిక్కుల్లో పడేసిన హోంటూర్ వీడియో
  • మూడేళ్లుగా అలెంగ్జాండ్రిన్ పారాకీట్ చిలుకలను పెంచుకుంటున్న నటుడు
  • స్వాధీనం చేసుకుని పార్కులో అప్పగించిన అటవీశాఖ అధికారులు
  • వాటిని పెంచుకునేందుకు అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదని వివరణ
  • క్షమాపణలు కోరడంతో జరిమానాతో సరిపెట్టిన అధికారులు
ఇంటిని వీడియో తీసి ‘హోం టూర్’ పేరుతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు రోబో శంకర్ అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వీడియోలో చిలుకలు ఉండడం చూసిన అటవీశాఖ అధికారులు వెంటనే ఆయన ఇంటికి చేరుకుని చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. నటుడికి చెన్నై సాలిగ్రామంలో ఇల్లు ఉంది. ‘హోం టూర్’ పేరుతో ఇంటిని వీడియో తీసిన శంకర్ దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. 

ఈ వీడియో బాగా వైరల్ అయింది. అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. అలెంగ్జాండ్రిన్ పారాకీట్ అనే రెండు చిలుకలు పంజరంలో ఉండడాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే నటుడి ఇంటికి చేరుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని గిండీలోని పార్కులో అప్పగించారు. ఆ సమయంలో రోబో శంకర్, ఆయన భార్య శ్రీలంకలో ఉండడంతో దర్యాప్తుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నేపథ్యంలో నిన్న ఆయన అటవీశాఖ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నాడు. మూడేళ్ల క్రితం తన భార్య స్నేహితురాలు ఆ చిలుకలను తెచ్చి ఇవ్వడంతో పెంచుకుంటున్నామని, అయితే వాటిని పెంచుకునేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు. తనను క్షమించాలని కోరాడు. దీంతో అధికారులు కేసు నమోదు చేయకుండా రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించి వదిలేశారు.
Alexandrine parakeets
Atcor Robo Shankar
Chennai

More Telugu News