Turkey: టర్కీలో మళ్లీ భూకంపం.. గత భూకంపంలో ఐదు మీటర్లు జారిపోయిన టర్కీ!

Turkey hit by another earthquake weeks after deadly tremors
  • టర్కీ, సిరియా భూకంపాల్లో 40 వేలమందికిపైగా మృతి
  • గత రాత్రి 6.4 తీవ్రతతో భూకంపం
  • భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటున్న నిపుణులు 
టర్కీ (తుర్కియే), సిరియాల్లో ఇటీవల సంభవించిన భూకంపం సృష్టించిన విలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 40 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. ఆ రెండు దేశాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారు ఇంకా సజీవంగా బయటపడుతూనే ఉన్నారు. తాజాగా, గత రాత్రి పొద్దుపోయాక మరో భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దేశ దక్షిణ ప్రాంతమైన హటే ప్రావిన్సులో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. గత భూకంపం కారణంగా బీటలు వారిన భవనాలు ఇప్పుడు కుప్పకూలాయి.

రెండు వారాల క్రితం ఈ నెల 6న తెల్లవారుజామున టర్కీలోని దక్షిణ కహ్రామన్మారస్ ప్రావిన్సుతోపాటు సిరియాలో సంభవించిన భూంకంపం తర్వాత మరో 40సార్లు భూమి కంపించింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. పట్టణాలు శ్మశానాల్లా మారాయి. వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని ప్రకారం.. టర్కీ, సిరియాల్లో భూకంపానికి కారణమైన రెండు ప్లేట్లు క్షితిజ సమాంతరంగా జారడంతో సిరియాతో పోలిస్తే టర్కీ ఆరు మీటర్ల మేర జారిపోయింది. అలాగే, అనాటోలియన్ ప్లేట్.. అరబికా ప్లేట్‌కు సంబంధించి నైరుతి దిశగా కదలడం వల్ల ఈ భూకంపం సంభవించినట్టు ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని తెలిపారు.
Turkey
Syria
Earthquake
Hatay province

More Telugu News