Iqra Jeewani: సరిహద్దులు దాటి భారతీయుడ్ని పెళ్లాడిన పాక్ అమ్మాయి... తిప్పిపంపిన అధికారులు

Officials deported Pakistan girl after she married Indian youth
  • ఆన్ లైన్ లూడో గేమ్ లో పరిచయం
  • యూపీ యువకుడితో పాక్ అమ్మాయి ప్రేమ
  • పాక్ నుంచి నేపాల్ చేరుకున్న అమ్మాయి
  • ఖాట్మండులో పెళ్లి చేసుకుని భారత్ చేరిక
  • బెంగళూరులో కాపురం
దేశాంతర ప్రేమలు, పెళ్లిళ్లు కొత్తేమీ కాదు. అయితే, పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి సరిహద్దులు దాటి వచ్చి భారత యువకుడ్ని పెళ్లాడి, ఇక్కడే ఉండిపోయే ప్రయత్నం చేయగా, అధికారులు ఆమెను తిప్పిపంపిన వైనం వెల్లడైంది. 

ఇఖ్రా జీవానీ... ఓ పాకిస్థానీ అమ్మాయి. వయసు 19 ఏళ్లు. ఆన్ లైన్ లో లూడో గేమ్ ఆడుతుండగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ములాయం సింగ్ (26) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇఖ్రా... కొద్దిరోజుల్లోనే ములాయంతో ప్రేమలో పడింది. అతడి కోసం సరిహద్దులు దాటి వచ్చింది.

ఆమెకు వీసా లేకపోవడంతో ములాయం సలహాపై తొలుత నేపాల్ చేరుకుంది. ఖాట్మండులో ములాయం ఆమెను కలుసుకున్నాడు. ఇద్దరూ అక్కడే పెళ్లి చేసుకుని, సరిహద్దుల్లోని సనోలీ ప్రాంతం నుంచి భారత్ లో ప్రవేశించారు. 

ములాయం కొన్నేళ్లుగా బెంగళూరులో ఉంటుండడంతో అక్కడే కాపురం పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు. ఇఖ్రా తన పేరును హిందూ పేరును తలపించేలా రవా అని మార్చుకుంది. అయితే, ఆమె నమాజ్ చేస్తుండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు ఇఖ్రాను అరెస్ట్ చేసి, ఆమె పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఆ పాకిస్థాన్ అమ్మాయిని పంజాబ్ లోని అమృత్ సర్ కు తరలించారు. అట్టారీ బోర్డర్ నుంచి ఆమెను పాక్ కు తిప్పి పంపారు.
Iqra Jeewani
Mulayam Singh
Pakistan
India
Bengaluru

More Telugu News