Hyderabad: ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి.. వీడియో షేర్ చేసిన హైదరాబాద్ ఎంపీ

  • ఒవైసీ ఇంటిపై రాళ్లదాడికి దిగిన గుర్తు తెలియని వ్యక్తులు
  • 2014 తర్వాత నాలుగోసారన్న ఒవైసీ
  • హై సెక్యూరిటీ జోన్‌లో దాడి జరగడం ఆందోళన కలిగిస్తోందన్న హైదరాబాద్ ఎంపీ
Hyderabad MP Asaduddin Owaisi Delhi Residence Attacked By Miscreants

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న సాయంత్రం ఆయన ఇంటికి చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన తన ఇంటిపై రాళ్లదాడి జరిగినట్టు గుర్తించారు. అనంతరం వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, 2014 తర్వాత ఇలాంటి దాడి జరగడం ఇది నాలుగోసారి పేర్కొన్నారు. 

రాళ్లు రువ్విన విషయాన్ని ఇంటి పనిమనిషి ద్వారా తెలిసిందన్న ఒవైసీ.. ఈ దాడిలో కిటికీ అద్దాలు బద్దలైనట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అదనపు డీసీపీ సారథ్యంలోని పోలీసులు ఒవైసీ ఇంటిని సందర్శించారు. ఘటనా స్థలం నుంచి సాక్ష్యాధారాలను సేకరించారు. అత్యంత భద్రత ఉండే జోన్‌లోనే దాడి జరగడం ఆందోళన కలిగిస్తోందన్న ఆయన నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

More Telugu News