Ranji Title: పుజారాకు వందో టెస్టు కానుక.. నాలుగోసారి రంజీ ట్రోఫీ నెగ్గిన సౌరాష్ట్ర

  • ఫైనల్లో బెంగాల్ పై 9 వికెట్ల తేడాతో గెలుపు
  • చెలరేగిన సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్
  • అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
Saurashtra wins 4th Ranji Title

వంద టెస్టుల మైలురాయి దాటిన చతేశ్వర్ పుజారాకు అతని స్వరాష్ట్రం సౌరాష్ట్ర గొప్ప బహుమతిని ఇచ్చింది. రంజీ ట్రోఫీలో నాలుగోసారి విజేతగా నిలిచింది. బెంగాల్ తో ఆదివారం ముగిసిన ఫైనల్లో జైదేవ్ ఉనాద్కట్ నేతృత్వంలోని సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బెంగాల్ 174 పరుగులకే ఆలౌట్ అవగా.. సౌరాష్ట్ర 404 పరుగులు సాధించి భారీ ఆధిక్యం దక్కించుకుంది. ఈ క్రమంలో భారీ లోటుతో 164/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన బెంగాల్ రెండో ఇన్నింగ్స్ లో 241 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్రకు 14 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 

కెప్టెన్ మనోజ్ తివారి (68), అనుస్తుప్ మజుందార్ (61) మాత్రమే రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనాద్కట్ ఆరు, చేతన్ సకారియా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 14 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 2.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి రంజీ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఉనాద్కట్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వందో టెస్టు ఆడుతున్న తమ రాష్ట్ర దిగ్గజ ఆటగాడు పుజారాకు రంజీ ట్రోఫీ నెగ్గి కానుక ఇస్తామని ఫైనల్ కు ముందు చెప్పిన ఉనాద్కట్ మాట నిలబెట్టుకున్నాడు. ఇది వరకు1936–37, 1943–44, 2019–20 సీజన్లలోనూ సౌరాష్ట్ర రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది.

More Telugu News