SS Rajamouli: బీజేపీ అజెండాను మోస్తున్నారనే విమర్శలపై రాజమౌళి స్పందన

  • ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రాజమౌళిపై విమర్శలు
  • బీజేపీ కోసం చారిత్రక పాత్రలను వక్రీకరించలేదన్న రాజమౌళి
  • అవి కాల్పనిక పాత్రలని, గతంలోనూ ఎంతో మంది చేశారని స్పష్టీకరణ
RRR director SS Rajamouli reacts to reports of him supporting BJP agenda

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపునకు నోచుకుంది. సినిమాని గొప్పగా తీశారంటూ విఖ్యాత హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరాన్, స్టీవ్ స్పిల్ బర్గ్ సైతం రాజమౌళిని ప్రశంసించారు. కానీ, ఈ సినిమా వెనుక రాజకీయ అజెండా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి. బీజేపీ అజెండాకి  రాజమౌళి మద్దతు ఇస్తున్నారంటూ కొందరు ఆరోపించారు. దీనిపై ద న్యూయార్కర్ అనే వీక్లీ మేగజైన్ కు రాజమౌళి తన వాదన ఏంటో వివరించారు.

‘‘బాహుబలి సినిమా కాల్పనిక కథ అని తెలిసిందే. బీజేపీ అజెండాకు అనుగుణంగా చారిత్రక పాత్రలను వక్రీకరించారనే దానిపై నేను చెప్పడానికి ఏమీ లేదు. ఆర్ఆర్ఆర్ అనేది ఓ డాక్యుమెంటరీ. ఇదేమీ చారిత్రక పాఠం కాదు. పాత్రలకు కల్పితాలు ఇవి. గతంలోనూ ఎన్నోసార్లు ఇలా చేశారు. ఆర్ఆర్ఆర్ చరిత్రను వక్రీకరించేది అయితే.. మాయాబజార్ కూడా అలాంటిదే అవుతుంది.

బీజేపీని లేదా బీజేపీ అజెండాను సమర్థిస్తున్నానంటూ నన్ను విమర్శించే వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను.  మొదట భీమ్ క్యారక్టర్ ను విడుదల చేసినప్పుడు ముస్లిం స్కల్ క్యాప్ పెట్టుకోవడాన్ని నేను చూపించాను. ఆర్ఆర్ఆర్ థియేటర్లను తగలబెడతామంటూ ఓ బీజేపీ నేత మమ్మల్ని బెదిరించారు. క్యాప్ తొలగించకపోతే రాడ్ తో కొడతానని హెచ్చరించారు. కనుక నేను బీజేపీ వ్యక్తినా, కాదా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. అతివాదాన్ని నేను అసహ్యించుకుంటాను. బీజేపీ కానీయండి, ముస్లిం లీగ్ లేదా ఏవరైనా సరే. సమాజంలోని ఏ వర్గంలో అయినా అతివాదాన్ని నేను వ్యతిరేకిస్తాను’’ అంటూ వివరణ ఇచ్చారు.

More Telugu News