Maharashtra: మహారాష్ట్రలో భూగర్భంలో నుంచి వింత శబ్దాలు.. వణికిపోతున్న జనం!

  • భూకంపం వస్తుందేమోనని వణికిపోతున్న లాతూర్ జనం
  • సిటీలోని వివేకానంద్ చౌక్ వద్ద నిన్న ఉదయం శబ్దాలు  
  • పరిశోధన జరుపుతున్న డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు 
Mysterious Sounds In This Maharashtra City Trigger Panic and Quake Rumours

భూగర్భంలో నుంచి శబ్దం రావడంతో మహారాష్ట్రలోని లాతూర్ లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ శబ్దాలు దేనికి సంకేతమోనని జనం వణికిపోతున్నారు. ఈ ఘటనపై పరిశోధన జరుపుతున్న అధికారులు మిస్టరీని ఛేదిస్తామని, శబ్దాలకు కారణమేంటనేది త్వరలోనే తేల్చేస్తామని అంటున్నారు. లాతూర్ లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

సిటీలోని వివేకానంద్ చౌక్ బుధవారం ఉదయం ఆఫీసులకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో హడావుడిగా ఉంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఇక్కడ భూమిలోపలి నుంచి వింత శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ శబ్దాలు వినిపించాయని తెలిపారు. శబ్దాల విషయం క్షణాలలోనే సిటీ మొత్తం పాకిపోయింది. దీంతో భూకంపం వస్తుందేమోనని జనం భయాందోళనలకు గురయ్యారు. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా.. డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన నిపుణులు వివేకానంద్ చౌక్ చేరుకుని పరిశోధన మొదలు పెట్టారు.

భూగర్భంలో నుంచి వచ్చిన శబ్దాలు ఏ ఉపద్రవానికి సంకేతమోనని లాతూర్ వాసుల్లో ఆందోళన నెలకొంది. గతంలో 1993లో కిల్లారీ గ్రామం చుట్టుపక్కల భూకంపం వచ్చి దాదాపు 10 వేల మంది చనిపోయారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వివేకానంద్ నగర్ లో భూగర్భంలో ఎలాంటి సీస్మిక్ యాక్టివిటీ జరిగిన సూచనలు కనిపించలేదని అధికారులు చెప్పారు.

భూకంపం వచ్చే సూచనలు కూడా ఏవీ లేవని డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు చెందిన ఔరద్ షహజ్ని, ఆశివ్ స్పష్టం చేశారు. లాతూర్ చుట్టుపక్కల ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయని తెలిపారు. 2022 సెప్టెంబర్ లో హసోరి, కిల్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూగర్భంలో నుంచి వింత శబ్దాలు వినిపించాయని గుర్తుచేశారు. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రజలకు భరోసా కల్పించారు.

More Telugu News