Komatireddy Venkat Reddy: నేను సర్వేల ఆధారంగానే మాట్లాడాను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదన్న కోమటిరెడ్డి
  • కేసీఆర్ కాంగ్రెస్ తో కలుస్తారని వ్యాఖ్యలు
  • ఆ మేరకు మీడియాలో కథనాలు
  • ఠాక్రేని కలిసేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన కోమటిరెడ్డి
  • హంగ్ వస్తుందని తాను అనలేదని వెల్లడి
Komatireddy explains his comments

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఠాక్రే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఆయనతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రాహుల్ గాంధీ చెప్పిందే తాను కూడా చెప్పానని స్పష్టం చేశారు. 

తానేమీ తప్పు మాట్లాడలేదని, తన వ్యాఖ్యల పట్ల రాద్ధాంతం చేయొద్దని అన్నారు. తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

"ఇప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పాను. సోషల్ మీడియా సర్వేలను బట్టి మాట్లాడుతున్నా. అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తెలంగాణలో హంగ్ వస్తుందని నేను అనలేదు" అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక, కాంగ్రెస్ సీట్లపై తన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని అన్నారు. 

మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ, పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని తేల్చి చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని అన్నారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకున్నాక స్పందిస్తానని తెలిపారు. పొత్తులపై రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పిందే ఫైనల్ అని ఠాక్రే స్పష్టం చేశారు.

More Telugu News