Kishan Reddy: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు వచ్చే అవకాశం ఉంది: కిషన్ రెడ్డి

  • ఏపీ పర్యటనకు వచ్చిన కిషన్ రెడ్డి
  • ధర్మవరం-విజయవాడ రైలు మచిలీపట్నం వరకు పొడిగింపు
  • జెండా ఊపి ప్రారంభించిన కిషన్ రెడ్డి
  • పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు పొడిగిస్తున్నట్టు వెల్లడి
Kishan Reddy says Vande Bharat train between Secunderabad and Tirupati is on cards

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మవరం-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును మచిలీపట్నం వరకు పొడిగించగా... ఆ రైలుకు విజయవాడ రైల్వే స్టేషన్ లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు మాదిరిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డీపీఆర్ సిద్ధమయ్యాక విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు షురూ అవుతాయని పేర్కొన్నారు. 

తిరుపతి-నెల్లూరు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాజమండ్రి, గూడూరు వంటి ముఖ్యమైన స్టేషన్లను ఆధునికీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్ వచ్చే ఆంధ్రులకు చర్లపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని వివరించారు.

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. డిసెంబరులోగా 100 వందేభారత్ రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

ఏపీలో రైల్వే విభాగానికి బడ్జెట్ లో రూ.8,600 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. షిరిడీ-విజయవాడ ఎక్స్ ప్రెస్ ను మచిలీపట్నం వరకు పొడిగిస్తామని పేర్కొన్నారు. హుబ్లీ-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. 

నంద్యాల-కడప ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట వరకు పొడిగిస్తామని వివరించారు. విశాఖ-కాచిగూడ రైలును మహబూబ్ నగర్ వరకు... విశాఖ-విజయవాడ ఎక్స్ ప్రెస్ ను గుంటూరు వరకు పొడిగిస్తామని తెలిపారు.

More Telugu News