Jagan: 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన జగన్

Jagan inaugurates tourist police stations
  • పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు
  • టూరిస్టులకు భయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారన్న సీఎం
  • పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్న జగన్
రాష్ట్ర వ్యాప్తంగా 26 పర్యాటక పోలీస్ స్టేషన్లను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ పోలీస్ స్టేషన్లను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పర్యాటకుల భద్రత కోసం ఈ పోలీస్ స్టేషన్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు భయం, ఇబ్బంది లేకుండా ఈ పోలీస్ స్టేషన్లలోని పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. 20 పర్యాటక ప్రాంతాల్లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో యాత్రికులు నిర్భయంగా గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయని తెలిపారు. 

పోలీస్ శాఖలో ఇప్పటికే అనేక సంస్కరణలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ఠ్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతోందని చెప్పారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులను పెట్టి ప్రజలకు తోడుగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
Jagan
YSRCP
Tourist Police Station

More Telugu News