Diabetes: మధుమేహంపై ప్రయోగించతగిన ఐదు ఆయుధాలు 

  • విటమిన్ డీ లోపిస్తే టైప్ 2 మధుమేహం
  • దీని లోపంతో ఇన్సులిన్ తక్కువగా విడుదల
  • ఫైబర్, ఒమెగా ఫ్యాటీ3 యాసిడ్స్ చాలా అవసరం
  • సిలీనియం, క్రోమియం పాత్ర కీలకం
Diabetes 5 important nutrients that can lower diabetes risk

తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అంతేకాదు, కొన్ని రకాల వ్యాధులకు మన ఆహార అలవాట్లు కారణమవుతుంటాయి. కొందరు తమకు వచ్చిన వ్యాధులు చూసి ఆశ్చర్యపోతుంటారు. చిన్న వయసులోనే ఎందుకు ఇలా? అని సందేహపడుతుంటారు. నిజానికి కొన్ని రకాల పోషకాలు లోపించడం కూడా వ్యాధులకు కారణమవుతుందని చాలా మందికి తెలియని విషయం. 

విటమిన్ డీ మధుమేహం రిస్క్ ను తగ్గిస్తుందని మసాచుసెట్స్ లోని టప్ట్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. విటమిన్ డీతోపాటు, మనకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలు మరికొన్ని ఉన్నాయి. ఇవి లోపించినా ఆరోగ్య సమస్యలను ఆహ్వానించినట్టు అవుతుంది. కనుక వీటి లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

విటమిన్ డీ
విటమిన్ డీతో టైప్-2 మధుమేహం రిస్క్ తగ్గించుకోవచ్చు. ఇటీవల విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయంగా దీన్ని చెప్పుకోవాలి. గతంలో పరిశోధకులు, వైద్యులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహం కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. విటమిన్ డీ లోపించినా, తక్కువగా ఉన్నా, అది ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. విటమిన్ డీ తగినంత శరీరానికి అందినప్పుడు ఇన్సులిన్ తగిన మోతాదులో విడుదల అవుతుంది. ఆహారం ద్వారా రక్తంలోకి చేరిన చక్కెరలను నియంత్రించేది ఇన్సులిన్ అని తెలిసిందే. కనుక విటమిన్ డీ లోపం లేకుండా చూసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు, పుట్టగొడుగుల ద్వారా విటమిన్ డీ కొంత లభిస్తుంది. అవసరమైతే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. 

ఫైబర్
దీన్ని పీచుగా చెబుతారు. మధుమేహం సమస్య ఉన్న వారికి ఫైబర్ తో కూడిన ఆహారం ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోకి కేలరీలు అన్నీ ఒకేసారి విడుదల కావు. పీచు వల్ల ఆహారం క్రమంగా జీర్ణమవుతుంది. ఫైబర్ లో, సాల్యుబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ అని రెండు రకాలుగా ఉంటుంది. కూరగాయలు, ముడి ధాన్యాల్లో ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ఓట్స్, నట్స్, సీడ్స్, బీన్స్ లో లభిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను ఇవి తగిస్తాయి. పీచులేని పిండిపదార్థాలతో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి.

ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్
శారీరక, మానసిక వృద్ధికి ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అవసరం. శరీరంలోని ఇన్ ఫ్లమ్మేషన్ ను ఇవి తగ్గిస్తాయి. ఇన్ ఫ్లమ్మేషన్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు వస్తాయి. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) పెరుగుతుంది. చేపల్లో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ 3 పుష్కలంగా లభిస్తాయి. ఫ్లాక్స్ సీడ్ (అవిశ), గుమ్మడి గింజలు, బాదం, వాల్ నట్స్ తదితర వాటిల్లో ఇవి లభిస్తాయి. 

సిలీనియం
ఇది యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటి. పాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. పరగడుపున రోజూ 200 ఎంసీజీ సిలీనియంను ఆరు నెలల పాటు మధుమేహ బాధితులు తీసుకోగా, వారిలో బ్లడ్ షుగర్, హెచ్ బీఏ 1సీ, కొలెస్ట్రాల్ తగ్గినట్టు ఓ పరిశోధనలో తేలింది. బీన్స్, హోల్ వీట్, చేపలు, తృణ ధాన్యాల్లో ఇది లభిస్తుంది. 

క్రోమియం
ఇన్సులిన్ యాక్టివిటీని పెంచడంలో క్రోమియం పాత్ర ముఖ్యమైనది. టైప్-2 మధుమేహ బాధితుల్లో క్రోమియం లోపాన్ని చాలా పరిశోధనలు గుర్తించాయి. అందుకే క్రోమియం రోజువారీ శరీరానికి అందేలా చూసుకోవాలి. మాంసం, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, నట్స్ లో క్రోమియం ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు ఓ సారి వైద్యులను సంప్రదించి వీటిల్లో ఏవైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించుకోవడం మంచిది.

More Telugu News