Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ రాబోతోంది.. మరో పార్టీతో కలిస్తేనే అధికారం: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy predicts hung assembly in coming elections
  • ఏ ఒక్క పార్టీకి 60 సీట్లు రావన్న కోమటిరెడ్డి
  • సీనియర్లు కష్టపడితే కాంగ్రెస్ కు 40 - 50 సీట్లు రావచ్చని కోమటిరెడ్డి అంచనా
  • మార్చి 1 నుంచి అందరం కలిసి పని చేస్తామని వెల్లడి
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రాబోతోందని... ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని... మరొక పార్టీతో కలవాల్సిందేనని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించే నాయకుడు తెలంగాణలో లేడని... కాంగ్రెస్ ను నేను గెలిపిస్తా అని ఎవరైనా అంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీలోని సీనియర్లంతా కలిసి, కష్టపడితే కాంగ్రెస్ కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు. మార్చి 1వ తేదీ నుంచి అందరం కలిసి పార్టీ కోసం పని చేస్తామని చెప్పారు.  

తనకున్న 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నానని... వచ్చేది హంగ్ అసెంబ్లీనే అని కోమటి రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ధనిక పార్టీలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేస్తాయని... అందుకే ముందుగానే కనీసం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని వరంగల్ కు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు హిందీలోనే చెప్పానని... అయితే, దీనిపై ఇంతవరకు పార్టీలో కనీసం చర్చ కూడా లేదని చెప్పారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించవచ్చని అన్నారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే సానుభూతి ప్రజల్లో ఉందని చెప్పారు. 

కాంగ్రెస్ లోని సీనియర్లంతా కలిసి కష్టపడితే... తనతో పాటు ఒక్కొక్కరు నాలుగు లేదా ఐదు సీట్లను గెలిపించుకుంటే 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ సెక్యులర్ పార్టీలని... వచ్చేది హంగ్ అసెంబ్లీనే కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. మాణిక్ ఠాక్రే వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడిందని అన్నారు. తాను బైక్, బస్సు యాత్ర చేస్తానని వెల్లడించారు.
Komatireddy Venkat Reddy
Congress
Hung

More Telugu News