zomato: 225 సిటీల నుంచి జొమాటో ఔట్

  • డెలివరీ సేవలు ఆపేసిన జొమాటో కంపెనీ
  • తగినన్ని ఆర్డర్లు రాకపోవడం వల్లే నిర్ణయం
  • ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.346 కోట్ల నష్టం
Food delivery company Zomato quits from 225 cities in the country

దేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాలలో సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా నగరాలలో తగినన్ని ఆర్డర్లు రాకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఫుడ్ డెలివరీ రంగంలో ఒడిదొడుకుల కారణంగా గతేడాది డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్లు నష్టపోయిందని పేర్కొంది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు తగినన్ని ఆర్డర్లు రాని నగరాలలో సేవలను నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. 

దేశంలోనే అత్యధికంగా ఉపయోగిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్ లలో జొమాటో కూడా ఒకటి.. కంపెనీ విస్తరణలో భాగంగా గతేడాది పలు చిన్న నగరాలలోనూ సేవలను మొదలుపెట్టింది. ఇందుకోసం భారీగా సొమ్ము వెచ్చించింది. అయితే, ఆయా నగరాలలో సేవలందించడం పెద్దగా లాభదాయకం కాదని త్వరలోనే తెలిసొచ్చిందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

ఈ నిర్ణయం వల్ల కంపెనీకి వాటిల్లిన నష్టాన్ని త్వరలోనే పూడ్చుకుంటామని వివరించారు. కాగా, గతంలో అమలు చేసిన గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ను జొమాటో మరోమారు తీసుకొచ్చింది. మెట్రో నగరాలతో పాటు, ఇతర నగరాలలో సేవలందించేందుకు సుమారు 800 మందిని నియమించుకుంటామని పేర్కొంది.

More Telugu News