Ravichandran Ashwin: అశ్విన్ ధాటికి ఆసీస్ విలవిల... 75 పరుగులకే 8 వికెట్లు డౌన్

  • నాగపూర్ టెస్టులో విజయం ముంగిట టీమిండియా
  • 5 వికెట్లు తీసిన అశ్విన్
  • ఇన్నింగ్స్ ఓటమి దిశగా ఆసీస్
  • ఆటకు నేడు మూడో రోజు 
Ashwin gets five wickets as Team India on winning track

నాగ్ పూర్ పిచ్ పై బంతి సుడులు తిరుగుతున్న వేళ... టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. అశ్విన్ 5 వికెట్లు తీసి ఆసీస్ వెన్నువిరిచాడు. మరో ఎండ్ లో రవీంద్ర జడేజా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తో రాణించగా... ఆసీస్ 75 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఓటమి ముంగిట నిలిచింది. 

223 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ కు ఏదీ కలిసిరాలేదు. సాధారణంగా ఓ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు పిచ్ ను హెవీ రోలర్ తో చదును చేస్తారు. కానీ, ఇవాళ ఉదయం నాగపూర్ పిచ్ ను తేలికపాటి రోలర్ తో చదును చేసినప్పుడే ఆసీస్ కు ఎలాంటి స్పిన్ కష్టాలు ఎదురవనున్నాయో తెలిసిపోయింది. పిచ్ పై పగుళ్లను ఆసరాగా చేసుకుని అశ్విన్, జడేజా జోడీ బంతిని విపరీతంగా టర్న్ చేయడంతో కంగారూలు ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. 

ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (5), వార్నర్ (10) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. లబుషేన్ (17), స్టీవ్ స్మిత్ (బ్యాటింగ్) ప్రతిఘటించారు. అయితే లబుషేన్ ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. ఓపెనర్ల వికెట్లు చేజిక్కించుకున్న అశ్విన్ మరోమారు చెలరేగి మాట్ రెన్ షా (2), పీటర్ హ్యాండ్స్ కోంబ్ (6), అలెక్స్ కేరీ (10)లను అవుట్ చేయడంతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (1), టాడ్ మర్ఫీ (2) కూడా ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే వికెట్లు అప్పగించారు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 29 ఓవర్లలో 8 వికెట్లకు 82 పరుగులు కాగా... స్టీవ్ స్మిత్ 21, నాథన్ లైయన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ ఇంకా 141 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు ఇవాళ మూడో రోజే.

More Telugu News