KTR: రాష్ట్రంలో సాక్షాత్తూ రామరాజ్యం నడుస్తోంది: కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి మల్లారెడ్డి పొగడ్తల వర్షం

  • బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి
  • తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారన్న మంత్రి
  • కేటీఆర్ 110 ఏళ్లు బతకాలని కాంక్షించిన మల్లారెడ్డి
  • టీఆర్ఎస్‌ను చంద్రుడిగా, బీఆర్ఎస్‌ను సూర్యుడిగా అభివర్ణించిన టీఆర్ఎస్ నేత
There Is A Rama Rajya In Telangana Says Minister Mallareddy

‘‘రామరాజ్యం గురించి విన్నాం.. రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు’’.. ఈ మాటన్నది మరెవరో కాదు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీలో నిన్న బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌పై ఆయన పొగడ్తలు కురిపిస్తున్నంత సేపు సభలో సభ్యులు నవ్వులు చిందించారు. 

మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాదాద్రి, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం, మిషన్ భగీరథ రూపంలో ఏడు అద్భుతాలను చూస్తున్నామన్నారు. దేశంలో కేటీఆర్ లాంటి మంత్రి మరెక్కడైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇటీవల దావోస్ వెళ్లి రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ప్రశంసించారు. కేటీఆర్ 110 సంవత్సరాలు జీవించాలని కోరుకున్నారు. 

కేంద్రం అసలు దొంగల్ని వదిలిపెట్టి ఐటీ, సీబీఐ, ఈడీలను తమపైకి ఉసిగొల్పుతోందన్నారు. అదానీకి అన్నీ అప్పగిస్తే పది రోజుల్లో రూ. 10 లక్షల కోట్లు ఆవిరైపోయాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అంటే చంద్రుడని, బీఆర్ఎస్ అంటే సూర్యుడని అభివర్ణించారు. చంద్రుడినే ఆపలేకపోయిన వారు ఇప్పుడు సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని తట్టుకోలగలరా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. రామన్న సీఎం, కేసీఆర్ పీఎం అవుతారని జోస్యం చెప్పారు.

More Telugu News