Bihar: మీరైతే ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. నా ప్రేమకు మాత్రం నిరుద్యోగం అడ్డుగా మారింది: బీహార్ డిప్యూటీ సీఎంకు యువతి లేఖ

Young Girl Writes Letter To Tejashwi Yadav on Unemployement Gone Viral
  • నాలుగేళ్లుగా ఓ రచయితను ప్రేమిస్తున్నానన్న యువతి
  • ఉద్యోగం లేకపోవడంతో ఆ విషయం చెప్పలేకపోతున్నానని ఆవేదన
  • పింకీ ఎవరో తనకు తెలియదన్న రచయిత ప్రభాత్
  • విషయం తెలిసి తన భార్య తనపై కోపంగా ఉందని వాపోయిన రచయిత
మీరైతే ప్రేమ పెళ్లి చేసుకున్నారు సరే.. కానీ ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ విషయం చెప్పేందుకు నిరుద్యోగం అడ్డంకిగా మారిందంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పాట్నాకు చెందిన పింకీ అనే యువతి లేఖ రాసింది. ఇప్పుడా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో చాలాకాలంగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేకపోవడంతో ఆవేదనగా ఆ యువతి ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

తాను నాలుగేళ్లుగా ప్రభాత్ అనే రచయితను ప్రేమిస్తున్నట్టు పింకీ అందులో పేర్కొంది. ఉద్యోగం వస్తే ఆ విషయాన్ని ఆయనతో చెప్పాలని అనుకుంటున్నానని, కానీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడకపోవడంతో తన కోరిక నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నోటిఫికేషన్ వెలువడినా అది లీకవుతుండడంతో పరీక్షలు జరగడం లేదని, తనలాంటి వారు ఎదురుచూడడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారని వాపోయింది. 

తేజస్వీ యాదవ్‌కు పింకీ రాసిన ఈ లేఖ వైరల్ కావడంతో రచయిత ప్రభాత్ స్పందించారు. తనకు పింకీ ఎవరో తెలియదని, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని స్పష్టం చేశారు. విషయం తెలిసి తన భార్య తనపై కోపంగా ఉందన్నారు. ఆ లేఖను బట్టి ఆమెకు ప్రధానంగా కావాల్సింది ఉద్యోగం మాత్రమేనని, ప్రేమ కాదని తెలుస్తోందన్నారు. తన పేరును ప్రచారానికి మాత్రమే వాడుకున్నట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Bihar
Tejashwi Yadav
Pinky Letter
Valentine's Day

More Telugu News