Palnadu District: ఫోన్‌లో మాట్లాడుతున్న అమ్మాయి.. అనుమానంతో డాబాపై నుంచి కిందికి తోసేసిన తండ్రి

Father Attempt To Murder His Daughter For Talking In Phone
  • పల్నాడు జిల్లా యడ్లపాడులో ఘటన
  • ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్న కుమార్తె
  • తండ్రి మందలించడంతో ఫోన్‌తో డాబాపైకి వెళ్లిన బాలిక
  • యువకుడితో మాట్లాడుతోందన్న అనుమానంతో కిందికి తోసేసిన తండ్రి
కుమార్తె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, పోలీసులు ఆమె తండ్రిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని రెండు రోజుల క్రితం ఇంట్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తండ్రి మందలించాడు. దీంతో ఆమె డాబాపైకి ఎక్కి తిరిగి ఫోన్‌లో మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసిన తండ్రి ఆమె ఎవరో యువకుడితో మాట్లాడుతోందని అనుమానించాడు. వెంటనే కుమార్తె గొంతుపట్టుకుని పైనుంచి కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Palnadu District
Edlapadu
Andhra Pradesh
Crime News

More Telugu News