Narendra Modi: బీబీసీని భారతదేశంలో నిషేధించాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court dismisses writ petition seeking ban on BBC In India
  • ఇటీవల ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ
  • గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో డాక్యుమెంటరీ
  • మోదీని తప్పుగా చూపించారంటూ బీజేపీ వర్గాల నిరసన
  • సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడం తెలిసిందే. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తయారైన ఈ డాక్యుమెంటరీ బీజేపీ వర్గాలను తీవ్ర ఆగ్రహనికి గురిచేసింది. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి బీబీసీ ఉద్దేశపూర్వకంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించి, ప్రసారం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన బీబీసీని మన దేశంలో నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే, ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఇది పూర్తిగా అపోహలతో కూడుకున్న పిటిషన్ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

ఇటీవల బీబీసీ తీరును వ్యతిరేకిస్తూ హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, బీరేంద్ర కుమార్ సింగ్ అనే రైతు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భారత్, కేంద్ర ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో ఈ డాక్యుమెంటరీ రూపొందించారని... అంతర్జాతీయంగా భారత్, ప్రధాని మోదీ పేరు మార్మోగుతుండడంతో కుట్రపూరితంగా ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారని పిటిషన్ లో పేర్కొన్నారు. 

భారత్ లో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు బీబీసీ ఈ రీతిలో హిందూ వ్యతిరేక ప్రచారానికి తెరదీసిందని ఆరోపించారు. ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తులు.. పూర్తిగా తప్పుగా ఊహించుకుని ఈ పిటిషన్ వేశారని, దీనికి విచారణార్హత లేదని కొట్టివేశారు.
Narendra Modi
BBC
Documentary
Gujarat Riots
Supreme Court
India

More Telugu News