ఇష్టారీతిన అప్పులు చేస్తే అధోగతే.. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని హెచ్చరిక
- పక్క దేశాలను చూసైనా తీరు మార్చుకోవాలని హితవు
- పదవీ కాంక్షతో అలవికాని హామీలు ఇవ్వొద్దని సూచన
- భావితరాల భుజాలపై రుణభారం మోపడం తగదన్న మోదీ
తమ పదవీకాంక్షతో భావితరాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కొంతమంది నేతలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధపడుతున్న విషయాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పంజాబ్ ఇప్పటికే ఓపీఎస్ ను తిరిగి అమలు చేస్తోంది. ఓట్ల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలు కోసం అందినకాడల్లా అప్పులు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థికంగా చితికిపోయిన పక్క దేశాల (శ్రీలంక, పాకిస్థాన్) ను చూసైనా నేర్చుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ హితవు పలికారు. మీ పదవీకాంక్షతో రాష్ట్రాలను వినాశనం వైపు నెట్టొద్దని కొంతమంది నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) ను తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపొందడానికి ఈ హామీ ప్రభావం ఎక్కువగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఓపీఎస్ అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై భారం ఎక్కువగా పడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని పట్టించుకోకుండా అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధపడుతోందని విమర్శించారు.