జింబాబ్వే బ్యాటర్ గ్యారీ అరుదైన రికార్డు.. రెండు దేశాల తరపున సెంచరీలు!

  • 2014-2017 మధ్య ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్యారీ బ్యాలెన్స్
  • అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు
  • ఇప్పుడు జింబాబ్వేకు ప్రాతినిధ్యం
  • అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసి అరుదైన రికార్డు
Zimbabwe Batter Gary Ballance becomes second player in Test history to set rare record

జింబాబ్వే మిడిలార్డర్ బ్యాటర్ గ్యారీ బ్యాలెన్స్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల తరపున సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలోని బులవాయోలో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజున గ్యారీ ఈ రికార్డు అందుకున్నాడు. 33 ఏళ్ల గ్యారీ ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 137 పరుగులు చేశాడు. టెస్టు కెరియర్‌లో అతడికిది ఐదో సెంచరీ. జింబాబ్వే తరపున తొలి సెంచరీ. ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మ్యాచ్‌లోనే గ్యారీ ఈ ఘనత సాధించాడు. తన స్వదేశమైన జాంబాబ్వేకు గ్యారీ గతేడాది చివర్లో వచ్చి స్థిరపడ్డాడు.  

గ్యారీ అంతకుముందు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 42 మ్యాచ్‌లు ఆడాడు. 2014 నుంచి 2017 మధ్య ఇంగ్లండ్ తరపున 23 టెస్టులు ఆడాడు. అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. అయితే, ఆ తర్వాత అతడు ఫామ్ కోల్పోవడంతో 2017లో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. 

సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన గ్యారీ 2021లో జింబాబ్వే తరపున ఆడేందుకు అర్హత సాధించాడు. ఆ దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు గతేడాది ప్రకటించాడు. గ్యారీ జింబాబ్వేలో పుట్టిపెరగడమే కాకుండా యువ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

ఇప్పుడు మళ్లీ స్వదేశానికి ఆడుతూ అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. విండీస్‌పై అజేయంగా 137 పరుగులు చేయడం ద్వారా రెండు వేర్వేరు దేశాలపై సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అంతకుముందు కెప్లెర్ వెసెల్స్ ఈ ఘనత అందుకున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు ప్రాతినిధ్యం వహించి సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు గ్యారీ ఈ రికార్డును అందుకున్నాడు.   

జింబాబ్వే టెస్టు జట్టులో చోటు దక్కడానికి ముందు గ్యారీ గత నెలలో ఒక టీ20, రెండు వన్డేల్లో సొంత దేశం తరపున ఆడాడు. కాగా, ఈ మ్యాచ్‌లో  సెంచరీ సాధించిన గ్యారీ జట్టుకు విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్‌ను  379/9 వద్ద డిక్లేర్ చేసింది.

More Telugu News