Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం

30 killed in Road accident in Pakistan Khyber Pakhtunkhwa
  • కారును ఢీకొని లోయలో పడిపోయిన బస్సు
  • ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు, ప్రధాని, ముఖ్యమంత్రి
  • గత నెలలో జరిగిన ప్రమాదంలో 41 మంది మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కోహిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది దుర్మరణం చెందారు.  మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కారు ఒకదాన్నొకటి బలంగా ఢీకొని లోయలో పడిపోయాయి. గిల్గిత్ నుంచి రావల్పిండి వెళ్తున్న బస్సు షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. 

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ప్రాంతంలో చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖాలిద్ ఖుర్షీద్ అధికారులను ఆదేశించారు.

ప్రమాద విషయం తెలిసిన ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కోరారు. అధ్యక్షుడు అరీఫ్ అల్వీ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు ఇటీవల సర్వసాధారణంగా మారాయి. గత నెలలో బలూచిస్థాన్‌లోని లాస్బెలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
Pakistan
Khyber Pakhtunkhwa
Road Accident
Rawalpindi

More Telugu News