Supreme Court: సుప్రీంకోర్టులో మరో తెలుగు జడ్జి.. జస్టిస్ పీవీ సంజయ్‌ కుమార్‌ ప్రస్థానం ఇదే

  • కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
  • హైదరాబాద్ కు చెందిన పీవీ సంజయ్‌ కుమార్‌కు అవకాశం
  • సుప్రీంకోర్టులో రెండుకు చేరిన తెలుగు జడ్జిల సంఖ్య
TELUGU JUDGE PV SANJAY KUMAR APOINTED AS SUPREME COURT  JUDGE

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫారసుతో కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ ఐదుగురిలో ఒకరు తెలుగు న్యాయమూర్తి కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌ సర్వోన్నత న్యాయస్థానంలో తన సేవలు అందించనున్నారు. దీంతో సుప్రీంకోర్టులో తెలుగు జడ్జీల సంఖ్య రెండుకు చేరుకుంది. సుప్రీంలో ఇప్పటికే తెలుగు జడ్జి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ఉన్నారు. జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌ ప్రస్తుతం మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ 1963 ఆగస్టు 14న హైదరాబాద్ లో జన్మించారు.ఆయన పూర్తిపేరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్. వారి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో వారి కుటుంబం స్థిరపడింది. 

ఆయన తండ్రి పి.రామచంద్రా రెడ్డి 1969-82 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ నిజాం కాలేజీలో కామర్స్‌ చదువుకున్నారు. 1988లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని తండ్రి కార్యాలయంలోనే న్యాయవాదిగా చేరారు. ఉమ్మడి ఏపీ హైకోర్టుతో పాటు వివిధ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. 2000-03 వరకు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2008లో ఉమ్మడి ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 10న పంజాబ్‌-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 14 నుంచి మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అవకాశం లభించింది.

More Telugu News