Peddagattu Jathara: రేపటి నుంచి పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు

  • లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు
  • రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నల్గొండ జిల్లా పోలీసులు
  • వాహనదారులు సహకరించాలన్న ఎస్పీ రాజేంద్రప్రసాద్
Peddagattu Jathara commence from tomorrow

పెద్దగట్టు జాతరగా పిలిచే సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి వారి జాతర రేపటి నుంచి ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెల 9వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నల్గొండ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల (మూసీ) బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. భారీ వాహనాలను, సరుకు రవాణా వాహనాలను మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా కోదాడ వెళ్లేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. 

అలాగే, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు. భారీ, సరుకు రవాణా వాహనాలను కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకునేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఎస్పీ కోరారు.

More Telugu News