Andhra Pradesh: ప్రభుత్వ కార్యదర్శులపై ఏపీ హైకోర్టు అసహనం.. రోజూ చూడాలంటే చికాకు పుడుతోందన్న న్యాయస్థానం!

AP Hight Court Fires On IAS Officers Gopala Krishna Dwivedi and SS Rawat
  • కోర్టు ధిక్కరణ కేసుల్లో దాదాపు 70 సార్లు కోర్టు మెట్లెక్కిన గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ఎస్ రావత్
  • దేశంలో ఎక్కడా లేనన్ని ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులోనే నమోదవుతున్నాయన్న న్యాయమూర్తి
  • ఆదేశిస్తే తప్ప ఉత్తర్వులు అమలు చేయడం లేదని ఆగ్రహం
  • బరితెగింపా? లెక్కలేని తనమా? అని ప్రశ్న
పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో పదేపదే న్యాయస్థానానికి వస్తున్న మిమ్మల్ని చూడాలంటేనే చికాగ్గా ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో వీరిద్దరూ దాదాపు 70 సార్లు కోర్టుమెట్లెక్కారు. ఈ విషయాన్ని కూడా న్యాయస్థానం గుర్తు చేసింది. 

దేశంలో ఎక్కడా నమోదు కానన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఒక్క ఏపీ హైకోర్టులోనే నమోదవుతున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తే తప్ప ఉత్తర్వులు అమలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. ఇది బరితెగింపా? లేదంటే లెక్కలేని తనమా? అని ప్రశ్నించింది.

ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రహదారి నిర్మాణానికి 2016లో గ్రావెల్ సరఫరా చేసిన బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రకాశం జిల్లా తాడివారిపల్లె గ్రామానికి చెందిన కంచర్ల కాసయ్య 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా నాలుగు వారాల్లో ఆ సొమ్మును చెల్లించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించినా ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో కాసయ్య మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు ప్రతివాదులు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో శుక్రవారం రావత్, గోపాలకృష్ణ ద్వివేది, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎ.దినేశ్ కుమార్, ఒంగోలు పంచాయతీరాజ్ డివిజన్ ఈఈ రమేశ్ బాబు, తర్లుపాడు ఎంపీడీవో నరసింహులు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పై వ్యాఖ్యలు చేశారు. ఉన్నతాధికారులను పదేపదే న్యాయస్థానంలో చూడ్డానికి చికాకేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు చెల్లింపులో జాప్యానికి వివరణ ఇస్తూ అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. మరోవైపు, బిల్లుల చెల్లింపు విషయంలో ఆర్థికశాఖ జాప్యం ఏమీ లేదంటూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ వివరణ ఇవ్వడంతో ఆయనపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది.
Andhra Pradesh
AP High Court
SS Rawat
Gopala Krishna Dwivedi

More Telugu News