Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై భార్యను రాడ్డుతో కొట్టి చంపేసిన భర్త

Man Killed His wife middle on the road in Hyderabad
  • భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
  • ఇంటికి రాకపోవడంతో కక్ష పెంచుకున్న భర్త
  • రెక్కీ నిర్వహించి మరీ అంతమొందించిన వైనం
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో నిన్న దారుణం చోటుచేసుకుంది. భార్యతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అకస్మాత్తుగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశాడో భర్త. పోలీసుల కథనం ప్రకారం.. ఇక్కడి డిఫెన్స్ కాలనీ(హాషంనగర్)కి చెందిన కరీనా బేగం(30), టోలిచౌకిలోని హకీంపేటకు చెందిన మహ్మద్ యూసుఫ్(36) భార్యాభర్తలు. ఏడేళ్ల క్రితం వివాహం కాగా, 5 ఏళ్లలోపు ముగ్గురు పిల్లలున్నారు.

పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత నుంచి భర్త వేధింపులు మొదలైనా కరీనా బేగం ఓపికతో భరిస్తూ వచ్చింది. అయితే, ఆ తర్వాత అవి మరింత ఎక్కువ కావడంతో ఏడాదిన్నర క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరింది. మరోవైపు, భార్య ఇంటికి రావడం లేదన్న కోపంతో ఉన్న భర్త యూసుఫ్.. వారం రోజులుగా ఆమె కదలికలను గమనిస్తూ వస్తున్నాడు. నిన్న ఉదయం 9 గంటల సమయంలో స్కూలుకు వెళ్లేందుకు కరీనా ఇంటి నుంచి బయలుదేరింది.

ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న యూసుఫ్.. ఆమెకు ఎదురెళ్లి మాట్లాడుతున్నట్టు నటించాడు. అలా కొంతదూరం నడుస్తూ ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న రాడ్డుతో భార్య తలపై బలంగా బాదాడు. అంతే.. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Crime News
Langar House

More Telugu News