పన్నీర్ సెల్వంను కలిసిన జయలలిత మేనకోడలు దీప

  • కుమార్తె నామకరణానికి పన్నీర్ సెల్వంను ఆహ్వానించిన దీప
  • తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి చేతిలో ఉందని వ్యాఖ్య
  • పోయెస్ గార్డెన్ లో పనులు పూర్తయిన తర్వాత తాము అక్కడే ఉంటామని వెల్లడి
Deepa meets Panneerselvam

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప కలిశారు. తన భర్త మాధవన్ తో కలిసి ఆమె పన్నీర్ సెల్వంతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి చేతిలో ఉందని ఆమె చెప్పారు. తన కుమార్తె నామకరణానికి ఆహ్వానించేందుకే పన్నీర్ సెల్వంను కలిశానని తెలిపారు. తొలి నుంచి కూడా పన్నీర్ సెల్వంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. 

అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. తన మేనత్త జయలలిత అధికార నివాసం పోయెస్ గార్డెన్ లో మరమ్మతులు జరుగుతున్నాయని... పనులు పూర్తయ్యాక తాము అందులోనే ఉంటామని వెల్లడించారు. కొన్ని నెలల క్రితం దీప ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో తన కూతురు నామకరణానికి దీప దంపతులు కొందరు ప్రముఖులను స్వయంగా కలుస్తూ వారిని వేడుకకు ఆహ్వానిస్తున్నారు.

More Telugu News