వీళ్ల ఫోన్లు వింటూ కూర్చోవడమేనా ప్రభుత్వం పని?: పేర్ని నాని

  • ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్ వట్టిదేనన్న పేర్ని నాని
  • సానుభూతి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యలు
Perni Nani on phone tapping issue

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. వీళ్ల ఫోన్లు వింటూ కూర్చోవడమేనా ప్రభుత్వం పని? అంటూ కోటంరెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వట్టిదేనని అభిప్రాయపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వానికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, తమకేమీ ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాళ్లకు పార్టీపై అభిమానం ఉంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినా, ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయరని పేర్ని నాని పేర్కొన్నారు. 

కోటంరెడ్డి ఆడియో లీక్ పైనా పేర్ని నాని స్పందించారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న కాల్ రికార్డింగ్ క్లిప్పింగ్ సంగతేంటో చూసుకోవాలని ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ క్లిప్పింగ్ పంపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవులు రాకపోవడంతో, సానుభూతి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఆరు పర్యాయాలు గెలిచిన వాళ్లకు కూడా మంత్రి పదవులు రాని పరిస్థితి ఉందని, సామాజిక న్యాయం కోణంలోనే మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందన్న విషయాన్ని గమనించాలని స్పష్టం చేశారు. 

ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చని, కానీ కోటంరెడ్డి బలహీన నాయకత్వాన్ని నమ్ముకుని ముందుకు వెళుతున్నట్టుందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

More Telugu News