పొలార్డ్ వీర బాదుడు.. రెండు సార్లు గ్రౌండ్ బయటికి బంతి.. వీడియో ఇదిగో!

  • ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో చెలరేగిన పొలార్డ్
  • 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ 
  • మ్యాచ్ కే హైలైట్ గా నిలిచిన రెండు సిక్స్ లు
Kieron Pollard Smashes Ball Outside Sharjah Stadium twice

ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే ఇందులో రెండు సిక్స్ లు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. పొలార్డ్ బాదుడు ధాటికి బంతులు రెండు సార్లు ఏకంగా గ్రౌండ్ బయట పడ్డాయి.

ఈ రెండు సందర్భాల్లో ఆసక్తికర ఘటనలు జరిగాయి. తొలిసారి గ్రౌండ్ బయటికి సిక్స్ కొట్టినప్పుడు.. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బంతి ఇవ్వలేదు. బంతిని తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తాడు. రెండోసారి కొట్టినప్పుడు మాత్రం ఇంకో వ్యక్తి వచ్చి.. స్టేడియంలోకి బంతిని విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘సిక్స్ ల వర్షం కురుస్తున్నప్పుడు.. రెండు రకాల క్రికెట్ లవర్లు ఉంటారు.. ఒకరు బంతిని తీసుకుని పరిగెడుతారు.. ఇంకొకరు తిరిగిస్తారు. మీరు ఏ కేటగిరీ?’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 జరుగుతోంది. ఎంఐ ఎమిరేట్స్, డెజర్ట్ వైపర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (50), ముహమ్మద్ వాసీమ్ (86), కీరెన్ పొలార్డ్ (50).. చెలరేగడంతో 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చతికిల పడిన డెజర్ట్ వైపర్స్ టీమ్.. 84 పరుగులకే ఆలౌట్ అయింది.

More Telugu News