మెల్ బోర్న్ లో భారతీయులపై ఖలిస్థాన్ అనుకూల వాదుల దాడి

  • సిఖ్స్ ఫర్ జస్టిస్ నిర్వహిస్తున్న రెఫరెండానికి వ్యతిరేకంగా ప్రదర్శన
  • ఆ సందర్భంలో దాడికి దిగిన ఖలిస్థాన్ అనుకూల వాదులు
  • హింసకు, విధ్వంసాలకు చోటు లేదన్న ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి
No place for violence vandalism Australian minister after pro Khalistanis attack Indians in Melbourne

మెల్ బోర్న్ లో భారతీయులపై ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల వాదుల దాడిని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి టిమ్ వాట్స్ ఖండించారు. ‘‘మెల్ బోర్న్ లోని ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన హింసను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజలు ఆస్ట్రేలియాలో శాంతియుతంగా నిరసన తెలియజేసుకోవచ్చు. హింసకు గానీ, ఇటీవల చూసిన విధ్వంస (భారత ఆలయాల ధ్వంసం) చర్యలకు గానీ చోటు లేదు. విక్టోరియా పోలీసులు వెంటనే స్పందించి, దర్యాప్తు చేయాలి’’ అంటూ మంత్రి ట్వీట్ చేశారు.

ఆదివారం విక్టోరియా రాష్ట్రం మెల్ బోర్న్ లో ఫెడరేషన్ స్క్వేర్ వద్ద కొందరు భారతీయులు భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే గ్రూపు అధికారికంగా నిర్వహిస్తున్న రెఫరెండమ్ ను వ్యతిరేకిస్తూ ప్రదర్శనకు దిగారు. ఆ సమయంలో ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల వాదులు దాడికి దిగారు. దీంతో కొందరు భారతీయులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లోకి చేరింది. దీనిపై భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్ కూడా స్పందించారు. ‘‘భారత్ ఆస్ట్రేలియా తమ తమ జాతీయ దినోత్సవాల సందర్భంగా భిన్నత్వం, ఏకత్వాన్ని చాటుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు బాధాకరం. శాంతియుత ప్రదర్శనలు హింసాత్మక రూపం దాల్చకూడదు’’ అని పేర్కొన్నారు.

More Telugu News