Narendra Modi: యావత్ ప్రపంచం అస్థిరంగా ఉంది.. అన్ని దేశాల దృష్టి మన బడ్జెట్ పైనే ఉంది: బడ్జెట్ సెషన్స్ కు ముందు ప్రధాని మోదీ   

  • కాసేపట్లో పార్లమెంటులో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు
  • ప్రజల ఆశలను నెరవేర్చేలా నిర్మల బడ్జెట్ తయారు చేశారని నమ్ముతున్నానన్న మోదీ
  • పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Entire worlds eyes are on Indian budget says PM Modi

కాసేపట్లో పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ప్రస్తుతం యావత్ ప్రపంచం అస్థిరత్వాన్ని ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో అన్ని దేశాల దృష్టి మన దేశ బడ్జెట్ పైనే ఉందని తెలిపారు. మన బడ్జెట్ ప్రపంచ దేశాలకు ఒక మార్గాన్ని చూపెడుతుందనే ఆశాభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులోని ఉభయసభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించబోతున్నారని అన్నారు. ఇది మన దేశ రాజ్యాంగం, ముఖ్యంగా మహిళలకు గర్వకారణమని చెప్పారు. 

'ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్' అనే నినాదాన్ని ఈ బడ్జెట్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ తెలిపారు. విపక్ష నేతలు పార్లమెంటు సమావేశాల్లో వారి విలువైన సూచనలను ఇస్తారనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. దేశ ప్రజలందరి ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ కూర్పులో కృషి చేశారని నమ్ముతున్నానని తెలిపారు. రాష్ట్రపతితో పాటు, మన ఆర్థిక మంత్రి కూడా మహిళే కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియానే కాకుండా యావత్ ప్రపంచం మన బడ్జెట్ కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. మరోవైపు, కాసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటుకు చేరుకున్నారు.

More Telugu News