Mahindra XUV400: మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ వాహనానికి అదిరిపోయే రెస్పాన్స్... 10 వేలకు పైగా బుకింగులు

  • విద్యుత్ వాహనాల సెగ్మెంట్లో మహీంద్రా వాహనం
  • రెండు వేరియంట్లలో మహీంద్రా ఎక్స్ యూవీ 400
  • దేశవ్యాప్తంగా 34 నగరాల్లో బుకింగ్ లు
  • మార్చి నుంచి ఈఎల్ వేరియంట్ డెలివరీ
  • దీపావళి నాటికి ఈసీ వేరియంట్ సరఫరా
Huge response to Mahindra XUV400 electric SUV

మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న కొత్త వాహనం మహీంద్రా ఎక్స్ యూవీ 400. ఇది విద్యుత్ ఆధారిత ఎస్ యూవీ. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో వస్తున్న ఎస్ యూవీ కావడంతో స్పందన మామూలుగా లేదు. ఈ వాహనానికి మహీంద్రా సంస్థ జనవరి 26న బుకింగ్ లు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 34 నగరాల్లో బుకింగ్ లు చేపట్టగా, 4 రోజుల్లోనే 10 వేలకు పైగా బుకింగ్ లు నమోదు కావడం విశేషం. 

మహీంద్రా ఎక్స్ యూవీ 400 ఈసీ, ఈఎల్ పేరిట రెండు వేరియంట్లలో వస్తోంది. వీటి ధరలు రూ.15.99 లక్షలు, రూ.18.99 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు వేరియంట్లలోనూ తొలి 5 వేల బుకింగ్ లకు ప్రత్యేక ధర వర్తింపజేయనున్నారు. ఈ కారును ఆవిష్కరించిన ఏడాదిలోపు 20 వేల యూనిట్లు డెలివరీ ఇవ్వాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. 

మహీంద్రా ఎక్స్ యూవీ 400 వాహనం డెలివరీలు మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. తొలుత ఈఎల్ వేరియంట్ ను మాత్రమే కస్టమర్లకు అందించనున్నారు. 2023 దీపావళి నాటికి ఈసీ వేరియంట్ ను డెలివరీ ఇచ్చే అవకాశాలున్నాయి.

More Telugu News