తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

  • తారకరత్నకు తీవ్ర గుండెపోటు
  • బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స
  • నేడు బెంగళూరు వచ్చిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • తారకరత్నను పరామర్శించిన సోదరులు
Jr NTR visits Tarakaratna at Nararayana Hrudayalaya hospital in Bengaluru

తీవ్ర గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నను పరామర్శించేందుకు జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి, నందమూరి కల్యాణ్ రామ్ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చలించిపోయారు. 

అనంతరం ఎన్టీఆర్ స్పందిస్తూ, తారకరత్న విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. తారకరత్న పోరాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి, త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నామని తెలిపారు.

కాగా, ఎన్టీఆర్ బెంగళూరు రాక నేపథ్యంలో, ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆరోగ్య మంత్రి సుధాకర్ ను  సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా ఆసుపత్రికి పంపించారు. కన్నడ సీఎం బొమ్మై జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తారు. 

ఇక, శివరాజ్ కుమార్ కుటుంబంతోనూ ఎన్టీఆర్ కు సాన్నిహిత్యం ఉంది. శివరాజ్ కుమార్ సోదరుడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్ కు ఆత్మీయ అనుబంధం ఉంది.

More Telugu News