Assam Chief Minister: మాతృత్వానికి సరైన వయసు.. 22 నుంచి 30 ఏళ్లు: అసోం సీఎం

  • మహిళలు సరైన వయసులోనే మాతృత్వాన్ని స్వీకరించాలన్న హిమంత బిశ్వ శర్మ
  • 14 ఏళ్ల లోపు అమ్మాయిలతో లైంగిక సంబంధం పెట్టుకుంటే నేరమని వ్యాఖ్య 
  • వచ్చే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు అరెస్టు కానున్నారని వెల్లడి
  • మైనర్లను పెళ్లి చేసుకునే వాళ్లకు జీవిత ఖైదు పడొచ్చని హెచ్చరిక
Appropriate Age For Motherhood Is 22 To 30 Years says Assam Chief Minister

మహిళలు సరైన వయస్సులో మాతృత్వాన్ని స్వీకరించాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. శనివారం గువాహటిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు, చిన్న వయసులో మాతృత్వాలను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.

అమ్మాయిల బాల్య వివాహాలు, చిన్న వయస్సులోనే తల్లులు కాకుండా నిరోధించడానికి అసోం ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘14 ఏళ్ల లోపు అమ్మాయిలతో లైంగిక సంబంధం పెట్టుకుంటే నేరమే. వచ్చే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు అరెస్టు కానున్నారు. మైనర్ ను పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా సరే వదిలిపెట్టం’’ అని హెచ్చరించారు.

చట్టపరంగా 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలు మాత్రమే పెళ్లి చేసుకునేందుకు అర్హులని, మైనర్లను పెళ్లి చేసుకునే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలికలను పెళ్లి చేసుకునే వాళ్లకు జీవిత ఖైదు కూడా పడొచ్చని స్పష్టంచేశారు. మహిళలు మాతృత్వాన్ని స్వీకరించడానికి 22 నుంచి 30 ఏళ్లు సరైన వయసని చెప్పారు. 30 దాటినా పెళ్లి చేసుకోని మహిళలు వెంటనే చేసుకోవాలని చమత్కరించారు. పెళ్లి ముందుగా చేసుకున్నా, ఆలస్యంగా చేసుకున్నా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 31 శాతం పెళ్లిళ్లు బాల్య వివాహాలేనని తెలిపారు.

More Telugu News