చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

  • ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో రన్నరప్ గా సానియా-బోపన్న
  • ఫైనల్లో ఓడిపోయిన భారత క్రీడాకారులు
  • ఫిబ్రవరిలో దుబాయ్ డబ్ల్యూటీఏ టోర్నీతో టెన్నిస్ కు వీడ్కోలు పలకనున్న సానియా
Australian Open 2023 Sania Mirza ends glorious Grand Slam career after finishing as runner up in mixed doubles final

తన కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. భారత ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ లో బరిలోకి దిగిన సానియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. మెల్ బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో శుక్రవారం జరిగిన ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-7 (2/6), 2-6 సెట్ల తేడాతో బ్రెజిల్ కు చెందిన లూయిసా స్టెఫాని-రఫేల్ మటోస్ ద్వయం చేతిలో ఓడిపోయింది. తొలి సెట్ లో ఇరు జంటలు హోరాహోరీగా తలపడ్డాయి. ఓ దశలో ఆధిక్యంలో 3-2తో ఆధిక్యంలో నిలిచిన భారత క్రీడాకారులు తర్వాత తడబడ్డారు. దాంతో, ప్రత్యర్థులు పుంజుకొని ఈ సెట్ ను టై బ్రేక్ కు తీసుకెళ్లారు. 

అక్కడ నిరాశ పరిచిన సానియా, బోపన్న సెట్ కోల్పోయారు. రెండో సెట్ లో బ్రెజిల్ ద్వయం.. భారత క్రీడాకారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలిచింది. దాంతో, రన్నరప్ ట్రోఫీతో సానియా తన గ్రాండ్ స్లామ్ కెరీర్ ను ముగించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన సానియా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. 2005లో ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్ తో సానియా గ్రాండ్ స్లామ్ అరంగేట్రం చేసింది. ఈ స్టేడియం తనకు చాలా ప్రత్యేకమన్న సానియా.. తన కుమారుడి సమక్షంలో గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతానని ఊహించలేదని చెప్పింది. కాగా, దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్ తో సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలకనుంది.

More Telugu News