Giridhar Gamang: బీఆర్ఎస్ దూకుడు.. కేసీఆర్ సమక్షంలో నేడు బీఆర్ఎస్ లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గమాంగ్

Odisha Ex CM Giridhar Gamang to join BRS today in presence of KCR
  • ఇతర రాష్ట్రాలకు బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో కేసీఆర్
  • బీఆర్ఎస్ లో చేరుతున్న గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు
  • ఒడిశా బీఆర్ఎస్ బాధ్యతలను గిరిధర్ కు కేసీఆర్ అప్పగించే అవకాశం
జాతీయ రాజకీయాల్లో తనదైన కీలక పాత్రను పోషించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, వివిధ జాతీయ సంఘాల నేతలతో ఆయన సమావేశాలను నిర్వహించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పలువురు సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులను ఆయన ఆహ్వానించారు. సంక్రాంతి తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా బీఆర్ఎస్ ను విస్తరిస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన తాజాగా దూకుడు పెంచారు. 

తాజాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గమాంగ్ తో పాటు ఆయన తనయుడు శిశిర్ గమాంగ్, ఒడిశా కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి సహా పెద్ద సంఖ్యలో నేతలు ఈరోజు బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఆసక్తిని చూపుతున్నారు. 

ఎవరీ గిరిధర్ గమాంగ్?

గిరిధర్ గమాంగ్ 9 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999 ఏప్రిల్ 17న జరిగిన అవిశ్వాస పరీక్షలో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్రను పోషించారు. అవిశ్వాస పరీక్ష చివరి నిమిషంలో పార్లమెంటుకు వచ్చి వాజ్ పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోవైపు, ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే ఆయన ఒడిశా సీఎంగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను పక్కన పెట్టేసింది. అనంతరం, ఆయన కుమారుడు శిశిర్ బీజేపీలో చేరినప్పటికీ... ఆ పార్టీలో ఆయన యాక్టివ్ గా లేరు. ఈ నేపథ్యంలో వీరు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఒడిశా బీఆర్ఎస్ బాధ్యతలను గిరిధర్ గమాంగ్ కు కేసీఆర్ కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.
Giridhar Gamang
Odisha
Ex CM
BRS
KCR

More Telugu News