Sankuratri Chandrasekhar: నాడు భార్యా పిల్లలను కోల్పోయిన సంకురాత్రి చంద్రశేఖర్...  కంటి వెలుగులు పంచుతూ పద్మశ్రీకి ఎంపిక

  • పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
  • ఏపీకి చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మ శ్రీ
  • కాకినాడలో కంటి ఆసుపత్రితో లక్షలాది మందికి ఆపరేషన్లు
  • చంద్రశేఖర్ సేవలను గుర్తించిన కేంద్రం
Story behind Sankuratri Chandrasekhar

కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కాకినాడలో కంటి ఆసుపత్రితో లక్షల మంది పేదలకు కంటి వెలుగులు పంచిన ఆయనను విశిష్ట పురస్కారం వరించింది. గొప్ప శాస్త్రవేత్తగా కెనడాలో స్థిరపడిన ఆయన సొంతగడ్డపై అడుగుపెట్టడానికి అత్యంత విషాద ఘటనే కారణం అని తెలిస్తే ఎంతో బాధ కలుగుతుంది. 

1943 నవంబరు 30న జన్మించిన సంకురాత్రి చంద్రశేఖర్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అనంతరం, పైచదువుల కోసం కెనడా వెళ్లారు. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. ఆయనకు 1975లో మంజరితో వివాహం జరిగింది. ఆమెది కాకినాడ. చంద్రశేఖర్, మంజరి దంపతులు శ్రీ కిరణ్ (6) అనే కుమారుడు, శారద (3) అనే కుమార్తె జన్మించారు. కాగా, 1985లో భార్యాబిడ్డలను భారత్ పంపించేందుకు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ఎయిరిండియా విమానం ఎక్కించారు. 

ఆ విమానం పేరు ఎంపరర్ కనిష్క-182. అయితే ఈ విమానాన్ని నాడు ఖలిస్థాన్ ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోగా, మరణించిన వారిలో డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ భార్య మంజరి, కొడుకు శ్రీ కిరణ్, కుమార్తె శారద కూడా ఉన్నారు. ఈ ఘటనతో సంకురాత్రి చంద్రశేఖర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఇదే ఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 

భార్యాబిడ్డల మరణం అనంతరం కెనడాలో ఆస్తులన్నీ అమ్మేసి కాకినాడ వచ్చేసిన చంద్రశేఖర్ కుమారుడు కిరణ్ పేరు మీద కంటి ఆసుపత్రి స్థాపించారు. ఇప్పటిదాకా ఆ కంటి ఆసుపత్రి ద్వారా 3.40 లక్షల మందికి పేదలకు 90 శాతం ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు చేయించారు. 38 లక్షల మందికి అవుట్ పేషెంట్ విభాగంలో సేవలు అందించారు. పేదల కళ్లల్లో వెలుగులు పంచుతూ, ఆ ఆనందంలోనే తన భార్యాబిడ్డలను చూసుకుంటూ, నిస్వార్థంగా వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. 

ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. తనకు ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ స్పందించారు. తానెప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదని, ఈ సమాజం కోసం తాను ఏంచేయగలనో అదే చేస్తున్నానని వెల్లడించారు. 

భార్యాబిడ్డలను కోల్పోయినప్పుడు... ఇకపై పేదవాళ్ల కోసమే జీవించాలని భావించానని తెలిపారు. తన ప్రస్థానంలో తన బృందం సభ్యులు ఎంతగానో సహకరించారని, వారందరి భాగస్వామ్యం వల్లే ఈ ఘనత సాధ్యమైందని భావిస్తున్నానని వివరించారు. 

పద్మ పురస్కారం ఆలస్యంగా వచ్చిందని భావించడంలేదని, అవకాశం ఉన్నంతవరకు సేవలందిండమే తన ఆశయం అని, అవార్డుల కోసం ఆలోచించలేదని డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు.

More Telugu News