నా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి, భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా: పవన్ కల్యాణ్

  • సమాజంలో కుల వివక్ష ఉందన్న జనసేనాని
  • వివక్షను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సూచన
  • చట్టాలను గౌరవించే వ్యక్తినే కానీ కోడి కత్తి డ్రామాలు వేసేవాడిని కానని వ్యాఖ్య 
  • పోలీసులను కొట్టిన చరిత్ర ముఖ్యమంత్రికి ఉందని ఆరోపణ
  • జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరించి ప్రసంగం
pawan kalyan speech at janasena party office in ap

తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తోటి భారతీయులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ఈ రోజు మనమంతా భారతీయులమని గర్వంగా చెప్పుకుంటూ జీవిస్తున్నామని, వాళ్లందరికీ జనసేన తరఫున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు గ్రహీతల్లో తనకు వ్యక్తిగతంగా తెలిసిన వారు ఉండడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

పద్మ అవార్డు గ్రహీత చంద్రశేఖర్..
సంకురాత్రి చంద్రశేఖర్ గారికి పద్మ అవార్డు ప్రకటించడంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా ఆయన సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. ఉగ్రవాదులు పేల్చేసిన విమానంలో అయినవాళ్లు అందరినీ పోగొట్టుకున్న చంద్రశేఖర్.. కాకినాడ వచ్చి సామాజిక సేవ చేస్తున్నాడని చెప్పారు.

పిల్లల కోసం దాచిన సొమ్ముతో..
తన పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన పక్కనపెట్టి భావితరాల భవిష్యత్తు కోసం జనసేన ఆఫీసును నిర్మించానని పవన్ కల్యాణ్ చెప్పారు. తనకేమన్నా అయితే తన పిల్లలకు ఇబ్బంది కలగ కూడదనే ఉద్దేశంతో రూ.3 కోట్లు జమచేసి వాటిని పిల్లలకు ఇద్దామని అనుకున్నానని, ఆ సమయంలో భావితరాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. పిల్లల కోసం దాచిన రూ.3 కోట్లను పార్టీ నిర్మాణం కోసం, జనసేన బిల్డింగ్ కోసం ఖర్చుపెట్టానని వివరించారు.

కుల వివక్ష ఉంది.. అంగీకరించాలి..
సమాజంలో కుల వివక్షలు ఉన్నాయని, వాటిని అంగీకరిద్దామని అన్నారు. కానీ వీటన్నిటి మధ్య సమతుల్యత తెచ్చి, అభివృద్ధి వైపు నడపడమెలా అనేది ఆలోచించాలని పవన్ కోరారు. చట్టాన్ని గౌరవించే వాడిని, వాటిని పాటించే వ్యక్తిని అని అన్నారు. చట్టాలకు అతీతంగా కోడి కత్తులతో పొడిపించుకునే డ్రామాలు చేయనని చెప్పారు. వారాహి వాహనం ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనీయమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైన ఆయనీ కామెంట్లు చేశారు.

పార్టీలు మారే విషయంలో..
ఒకసారి కమ్యూనిస్టులతో, మరోసారి బీజేపీతో కలుస్తానంటూ తనపై వచ్చిన ఆరోపణలకు జవాబిస్తూ.. పూర్తి కమ్యూనిజం, పూర్తిగా రైట్ వింగ్ ఆలోచనలు రెండూ ప్రస్తుత ప్రపంచానికి సరిపడవని చెప్పారు. అందులో ఏది కరెక్ట్ అయినా ప్రపంచమంతా ఇప్పుడు అదే భావజాలం ఉండేదని అన్నారు. ఆ రెండింటి మధ్యస్థంగా ఉన్న విధానాన్ని పట్టుకున్నానని పవన్ వివరించారు. దీని వెనక తనకు వ్యక్తిగత స్వార్థం ఏమీలేదని చెప్పారు.

పోలీసు వ్యవస్థంటే జగన్ కు గౌరవంలేదు..
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు సెల్యూట్ కొట్టే ముఖ్యమంత్రికి మీపైన, మీ వ్యవస్థపైనా గౌరవం లేదు’ అంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ టీనేజ్ లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టిన ఘనత ఉంది. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ జగన్ చేతుల్లో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం మానవ హక్కులకు సంబంధించిన దాంట్లో ఉంటుందన్నారు. వైసీపీ నేతలు ప్రజలకు బాధ్యతగా ఉండక్కర్లేదని అనుకుంటున్నారు.. కానీ మీ మెడలు వంచి జవాబు చెప్పిస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తనతో సహా ఎవరినీ గుడ్డిగా ఆరాధించొద్దని అభిమానులకు పవన్ సూచించారు.

More Telugu News