Pakistan: ‘పరువు’ పోగొట్టుకుంటున్న పాక్.. కోర్టులోనే కుమార్తెను కాల్చేసిన తండ్రి!

  • తండ్రిని ఎదిరించి వైద్యుడిని పెళ్లాడిన కుమార్తె
  • వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చిన కుమార్తెపై తండ్రి కాల్పులు
  • అక్కడికక్కడే మృతి చెందిన కుమార్తె 
  • పరువు పేరుతో ప్రతి ఏటా పాక్‌లో వందలాది మంది మహిళల హత్య
Another Honour Killing In Pak Father Killed Daughter In Court

పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరువు హత్యలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న కుమార్తెను ఓ తండ్రి కోర్టులోనే కాల్చి చంపాడు. ఓడరేవు నగరమైన కరాచీలో జరిగిందీ ఘటన. నగరంలోని పిరాబాద్‌కు చెందిన యువతి తల్లిదండ్రులను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా ఓ యువకుడిని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు కరాచీ సిటీ కోర్టుకు హాజరైంది.

బాధితురాలు ఇటీవల ఓ వైద్యుడిని వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చిన సమయంలో ఆమె తండ్రి కాల్పులు జరిపాడని, తీవ్రంగా గాయపడిన యువతి కోర్టు హాలులోనే మరణించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశంలో జరుగుతున్న పరువు హత్యల వెనక తండ్రి, భర్త, సోదరుడు లేదంటే మరో కుటుంబ సభ్యుడో ఉంటున్నట్టు పోలీసులు వివరించారు. తాజా ఘటనలో యువతి తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తండ్రి ఆగ్రహానికి అదే కారణమని పేర్కొన్నారు. 

పరువు పేరుతో పాకిస్థాన్‌లో ప్రతి సంవత్సరం వందలాదిమంది మహిళలు హత్యకు గురవుతున్నారు. పాకిస్థాన్ మానవహక్కుల సంస్థ (హెచ్ఆర్‌సీపీ) ప్రకారం.. గత దశాబ్ద కాలంలో ఏడాదికి సగటున 650 పరువు హత్యలు జరిగాయి. వెలుగులోకి రాని వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

More Telugu News