మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన బాలుడు.. రోహిత్‌కు హగ్.. వీడియో ఇదిగో!

22-01-2023 Sun 10:02 | Sports
  • రాయ్‌పూర్‌లో కివీస్‌తో రెండో వన్డే
  • బాలుడు మైదానంలోకి రావడంతో ఆటకు అంతరాయం
  • బాలుడిపై చర్యలు తీసుకోవద్దన్న రోహిత్
Boy Hugs Team India Skipper Rohit Sharma In 2nd One Day
న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది కళ్లు గప్పిన ఓ బాలుడు వేగంగా మైదానంలోకి దూసుకెళ్లి క్రీజులో ఉన్న టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మను వాటేసుకున్నాడు. 

ఈ అకస్మాత్తు పరిణామంతో అందరూ విస్తుపోయారు. ఆటకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మైదానంలోకి పరిగెత్తి రోహిత్‌ను హగ్ చేసుకున్న బాలుడిని పట్టుకుని తీసుకెళ్లారు. అయితే, బాలుడిపై చర్యలు తీసుకోవద్దని రోహిత్ చెప్పడంతో వారు విడిచిపెట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.