అమ్మాయిల ప్రేమకథలో ఊహించని ట్విస్ట్.. లింగమార్పిడి చేయించుకున్నాక వద్దు పొమ్మంటున్న ప్రియురాలు!

22-01-2023 Sun 07:41 | Offbeat
  • ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఘటన
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు
  • ప్రేమికురాలి కోసం లింగమార్పిడి ద్వారా పురుషుడిగా మారిన సనా ఖాన్
  • మరొకరి ప్రేమలో పడి సనాను తిరస్కరిస్తున్న సోనాల్
  • కోర్టును ఆశ్రయించిన సనా ఖాన్
UP girl switches gender to marry girlfriend but girlfriend Takes You Turn
ప్రాణప్రదంగా ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి పెద్దల నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారిలో ఒకరు లింగమార్పిడి ద్వారా పురుషుడిగా మారారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు వీరిద్దరూ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ 2017లో వివాహం చేసుకున్నారు. సనాఖాన్ రూ. 6 లక్షలు ఖర్చు చేసి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా పురుషుడిగా మారి తన పేరును సుహైల్ ఖాన్‌గా మార్చుకుంది. ఇన్ని రోజులు ఇద్దరూ కాపురం కూడా చేశారు. 

ఇప్పుడు సోనాల్ శ్రీవాత్సవ అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించింది. నీతో కలిసి ఉండలేనంటూ సుహైల్‌కు తేల్చి చెప్పింది. దీంతో నిర్ఘాంతపోయిన సుహైల్ కోర్టును ఆశ్రయించింది. వివాహం చేసుకున్న తర్వాత సోనాల్‌కు ఓ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడామెకు మరో అబ్బాయితో ఏర్పడి పరిచయం ప్రేమగా మారింది. దీంతో సనా ఖాన్‌ను దూరంపెట్టడం ప్రారంభించింది. ఇద్దరం కలిసి ఉండడం సాధ్యం కాదని, కావాలంటే మళ్లీ అమ్మాయిగా మారాలని సనా ఖాన్‌కు చెప్పడంతో ఆమె షాకైంది. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవంతో గతేడాది జూన్ 3 సనా కోర్టును ఆశ్రయించింది.

కేసు విచారణకు హాజరు కావాలంటూ సోనాల్‌కు కోర్టు నోటీసులు పంపింది. అవి స్వీకరించేందుకు నిరాకరించడంతో కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ చేసిన పోలీసులు ఈ నెల 18న ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. వచ్చే నెల 23కు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.