టీమిండియా క్రికెటర్ కు రూ.44 లక్షలకు టోకరా వేసిన స్నేహితుడు

21-01-2023 Sat 18:34 | Sports
  • స్నేహితుడ్నే మేనేజర్ గా నియమించుకున్న ఉమేశ్ యాదవ్
  • ఆర్థిక లావాదేవీల బాధ్యతలు కూడా అప్పగింత
  • నాగపూర్ లో ప్లాట్ కొనేందుకు ఆసక్తి చూపిన ఉమేశ్
  • రూ.44 లక్షలు మిత్రుడి ఖాతాలో జమ
  • తన పేరిట ప్లాట్ కొనుక్కున్న మిత్రుడు
Friend duped Team India cricketer Umesh Yadav
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ స్నేహితుడి చేతిలో మోసపోయాడు. పైగా ఆ స్నేహితుడే ఉమేశ్ యాదవ్ కు మేనేజర్ గా వ్యవహరించాడు. ఉమేశ్ యాదవ్ స్వస్థలం మహారాష్ట్రలోని నాగపూర్. ఇక కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్ కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. ఉమేశ్ యాదవ్ టీమిండియాకు ఎంపికయ్యాక, తన వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడు ఠాక్రేను పర్సనల్ మేనేజర్ గా నియమించుకున్నాడు. 

ఫ్రెండ్ కావడంతో శైలేష్ ను నమ్మిన ఉమేశ్ అతడికి తన ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణను కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు. 

కాగా, నాగపూర్ లోనే మంచి స్థలం అమ్మకానికి వచ్చిందని ఠాక్రే... ఉమేశ్ కు చెప్పాడు. దాంతో ఆ స్థలం కొనేందుకు ఆసక్తి చూపించిన ఉమేశ్ యాదవ్ రూ.44 లక్షలను ఠాక్రే ఖాతాలో వేశాడు. అయితే, ఠాక్రే ఆ ప్లాట్ ను తన పేరిట కొనుగోలు చేశాడు. తనను ఠాక్రే దారుణంగా మోసం చేశాడని గుర్తించిన ఉమేశ్ యాదవ్... తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అందుకు ఠాక్రే నిరాకరించడంతో... ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. 

కోరాడి పట్టణ పోలీసులు ఉమేశ్ యాదవ్ ఫిర్యాదును స్వీకరించి సెక్షన్ 406, సెక్షన్ 420 కింద ఠాక్రేపై కేసు నమోదు చేశారు. అయితే అతడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.