New Zealand: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్!

Chris Hipkins To Be New Zealand PM
  • అధికార లేబర్ పార్టీ నుంచి పోటీలో ఆయనొక్కరే
  • రేపు క్రిస్ ను పార్టీ నాయకుడిగా ఎన్నుకోనున్న నేతలు
  • 41వ ప్రధానిగా అక్టోబర్ దాకా కొనసాగే అవకాశం
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారైంది. అధికార లేబర్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలందరూ కలిసి క్రిస్ హిప్కిన్స్ ను అధికారికంగా ఎన్నుకుంటారు. తర్వాత న్యూజిలాండ్ 41వ ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ‘‘క్రిస్ హిప్కిన్స్‌ నామినేషన్‌ను ఆమోదించడానికి, ఆయన్ను పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు సమావేశమవుతాం’’ అని లేబర్ పార్టీ సీనియర్ సభ్యుడు డంకన్ వెబ్ ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించి జెసిండా ఆర్డెర్న్ అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు లేబర్ పార్టీలో 44 ఏళ్ల క్రిస్ కు మాత్రమే నామినేషన్ దక్కింది. ప్రస్తుతం హోం, విద్యా శాఖ మంత్రిగా క్రిస్ పని చేస్తున్నారు. ప్రధానిగా ఎన్నికైతే వచ్చే అక్టోబర్ దాకా ఆ పదవిలో కొనసాగుతారు. అక్టోబర్ 14న న్యూజిలాండ్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

క్రిస్ హిప్కిన్స్ 2008లో తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2020 నవంబర్ లో కరోనా రెస్పాన్స్ శాఖ మంత్రిగా పనిచేశారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందారు.
New Zealand
Chris Hipkins
Jacinda Ardern
Labour Party

More Telugu News