indo american: అమెరికా అధ్యక్ష పీఠంపై కన్నేసిన భారత సంతతి మహిళ!

  • రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిక్కీ హేలీ బరిలో నిలిచే అవకాశం
  • గతంలో సౌత్ కరోలినా గవర్నర్ గా పని చేసిన హేలీ
  • ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్
Indian American Nikki Haley in fray for USA presidential candidate

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ అధ్యక్ష ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రహస్య పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల విషయంలో చర్చ నడుస్తోంది. భారత సంతతికి చెందిన మహిళ నిక్కీ హేలీ అగ్రరాజ్యం అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాలతో పాటు దౌత్యపర అంశాల్లోనూ ఆమెకు మంచి అనుభవం ఉంది. గతంలో హేలీ సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేశారు. 

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో 2017 నుంచి 2018 వరకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆమె ఈ మధ్య మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమె త్వరలోనే దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాట్ నేత జో బైడెన్‌కు మరో అవకాశం ఇవ్వకూడదని ఆమె స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని హేలీ తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? ఆ కొత్త నాయకత్వానికి తానే నేతృత్వం వహించాలా? అనే విషయాలపై ఆలోచించాలని చెప్పారు. ప్రస్తుతం అమెరికాకు కొత్త నాయకత్వం అవసరం అనేది తన అభిప్రాయమని నిక్కీ స్పష్టం చేశారు. అమెరికాను కొత్త బాటలో నడిపించగలనన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ రేసులో ఓడిపోలేదని గుర్తు చేశారు. అలాగే ఇక మీదట కూడా ఓడిపోనని చెప్పారు. కాగా, ప్రస్తుతం భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

More Telugu News