‘వందేభారత్’పై మళ్లీ దాడి.. ఈసారి బీహార్‌లో

21-01-2023 Sat 09:52 | National
  • ‘వందేభారత్’ రైళ్లపై కొనసాగుతున్న రాళ్ల దాడులు
  • పశ్చిమ బెంగాల్, విశాఖలోనూ దాడులు
  • బీహార్‌లోని కతిహార్ జిల్లాలో తాజా ఘటన
  • పగిలిన సి6 బోగీ అద్దాలు
Stones pelted at Vande Bharat Express in Bihar
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. రైలు నంబరు 22302పై కొందరు దుండగులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది డిసెంబరు 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగింది.

అలాగే, సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖలో దాడి జరిగింది. ట్రయల్ రన్ ముగించుకుని మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్‌కు వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలోనూ కిటీకి అద్దాలు దెబ్బతిన్నాయి. వందేభారత్ రైళ్లపై జరుగుతున్న వరుస రాళ్ల దాడులు అధికారులను కలవరపెడుతున్నాయి.