పఠాన్ సినిమాను విడుదల చేస్తే థియేటర్లు తగలబెడతానన్న యువకుడి అరెస్ట్

21-01-2023 Sat 07:22 | Entertainment
  • సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసిన యువకుడు
  • వార్తా పత్రికల్లో అతడి వ్యాఖ్యలు ప్రముఖంగా ప్రచురణ
  • వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందన్న పోలీసులు
  • ఈ నెల 25న పఠాన్ సినిమా విడుదల
Ahmedabad Youth Arrest For warns movie theaters set to fire if pathaan released
ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాస్పదమైన షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ను ప్రదర్శించే థియేటర్లను తగలబెడతానని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సన్నీ షా ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేస్తూ.. పఠాన్ సినిమాను ప్రదర్శించాలని చూసే థియేటర్లకు నిప్పు పెడతానని బెదిరించాడు. అతడి హెచ్చరికలకు సంబంధించిన వార్తలు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 

విషయం తెలుసుకున్న అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ యజమానుల్ని బెదిరించిన వీడియోను అందులో గుర్తించారు. నిందితుడి వ్యాఖ్యలు మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉన్నాయని పోలీసులు తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షారుఖ్-దీపిక పదుకొణె జంటగా నటిస్తున్న పఠాన్ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.