చంద్రబాబును అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి.. ఆయనొస్తే సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేస్తారు: మంత్రి ధర్మాన

21-01-2023 Sat 06:39 | Andhra
  • సంక్షేమ పథకాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదన్న మంత్రి 
  • రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖను రాజధానిగా వద్దంటున్నారని వ్యాఖ్య
  • వలంటీర్లను తమ పార్టీ కార్యకర్తలుగా సంబోధన
Stop Chandrababu Naidu Not To Become CM Says Minister Dharmana
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖపట్టణంలో కార్యనిర్వాహక రాజధానిని వద్దంటున్నారని ఆరోపించారు. దీనిని అందరూ వ్యతిరేకించాలని, విశాఖ రాజధాని అయితే పెట్టుబడులొస్తాయని, ఫలితంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. చంద్రబాబు మాయమాటలను నమ్మొద్దని, ఆయనను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలులో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబుకు కనుక అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేస్తారని ప్రజలను హెచ్చరించారు. సంక్షేమ పథకాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని అన్నారు. కరోనా సమయంలో తమ కార్యకర్తలు.. అంటే వలంటీర్లు ఇంటింటికీ సరుకులు తెచ్చి ఇచ్చారని అన్నారు. కొన్ని టీవీలు, పత్రికలు చంద్రబాబు కోసమే పుట్టాయని విమర్శించారు. మీ కుటుంబాలు హాయిగా ఉండేందుకు కారణమైన వైసీపీ ప్రభుత్వ విధానాలను కొనసాగించేందుకు సహకరిస్తామని మీరంతా చెప్పాలని ప్రజలను ధర్మాన కోరారు.