క్యాలీ ఫ్లవర్ నిండా ఔషధ గుణాలే

20-01-2023 Fri 12:45 | Health
  • యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
  • విటమిన్ కే, సీ కూడా లభిస్తాయి
  • ఫ్రీరాడికల్స్ ను నిర్వీర్యం చేస్తాయి
  • వ్యాధి నిరోధక శక్తి పటిష్ఠానికి ఉపయోగం  
Potential Health Benefits of Cauliflower
మనలో కొందరు కొన్ని రకాల కూరగాయలనే ఇష్టపడతారు. కొందరు కొన్నింటిని అసలుకే తీసుకోరు. అయితే, ప్రతి ఒక్కరూ తినాల్సిన ముఖ్యమైన వాటిల్లో క్యాలీఫ్లవర్ ఒకటి. దీన్ని కొందరు ఎంతో ఇష్టంగా తీసుకుంటుంటారు. నచ్చినా, నచ్చకపోయినా ఆరోగ్యాన్ని కాపాడే ఇలాంటి మంచి కూరగాయను ఎవరూ కూడా మిస్ కాకూడదు. 

ఫ్రీరాడికల్స్ పై పోరాటం
క్యాలీఫ్లవర్ రుచిలోనే కాదు, ఔషధ గుణాల్లోనూ మంచి కాయగూర. క్రూసీఫెరోస్ జాతికి చెందిన దీనిలో ఫైటోకెమికల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మన శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ పై పోరాడడానికి ఫైటో కెమికల్స్ సాయపడతాయి. మన కణాలను ఈ ఫ్రీరాడికల్స్ దెబ్బతీస్తుంటాయి. దీనివల్ల మనకు హాని కలుగుతుంది. క్యాలీఫ్లవర్ ను తినడం వల్ల ఫ్రీరాడికల్స్ నిర్వీర్యం అవుతాయి. అలాగే, ఆంతోక్సాంథిన్స్, ఫ్లావనాయిడ్స్, క్లోరోఫిల్, క్వెర్సెటిన్, క్యుమారిక్ యాసిడ్ కూడా క్యాలిఫ్లవర్ లో ఉంటాయి. 

ఇన్ ఫ్లమేషన్ నియంత్రణ
ఇక మన శరీరానికి నష్టం చేసే వాటిల్లో ఇన్ ఫ్లమేషన్ (వాపు) కూడా ఒకటి. కేన్సర్, మధుమేహం, మూత్ర పిండాలు, గుండె జబ్బులకు ఇన్ ఫ్లమేషన్ కారణమవుతుంది. అందుకే ఇన్ ఫ్లమేషన్ ను సైలంట్ కిల్లర్ అని పిలుస్తారు. కొన్ని రకాల ఆహారాలతో ఇన్ ఫ్లమేషన్ పెరుగుతుంది. కానీ, క్యాలీఫ్లవర్ ను తీసుకుంటే ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది.

ఏదైనా గాయం అయినప్పుడు మన శరీరం నుంచి విడుదల చేసే రక్షణ స్పందన ఇన్ ఫ్లమేషన్. ఇన్ ఫ్లమేషన్ కణాలను గాయం అయిన చోటుకి శరీరం పంపిస్తుంది. దీంతో ఆ గాయం మానడానికి సాయపడతాయి. ఎటువంటి గాయం లేకపోయినా, ఇన్ఫెక్షన్ లేకపోయినా ఇన్ ఫ్లమేషన్ ఉందంటే దాన్ని క్రానిక్ ఇన్ ఫ్లమేషన్ గా పిలుస్తారు. దీర్ఘకాలంలో దీని వల్ల వ్యాధులకు గురికావాల్సి వస్తుంది.

వ్యాధి నిరోధక శక్తి
ఎన్నో రకాల వైరస్ లు, జబ్బుల నుంచి మనకు బలమైన రక్షణ ఉండాలంటే అందుకు వ్యాధి నిరోధక శక్తి కీలకం. దీని కోసం తగినంత విటమిన్ సీ తీసుకోవాలి. క్యాలీఫ్లవర్ లో విటమిన్ సీ తగినంత లభిస్తుంది. తురిమిన ఒక కప్పు క్యాలీఫ్లవర్ లో 51.6 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. 

క్యాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్ మాదిరి పనిచేస్తుంది. ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్ కే లభించే ఏకైక కాయగూర క్యాలీఫ్లవర్. రక్తం గడ్డకట్టేందుకు ఇది అవసరం. ఉదాహరణకు మనకు గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఇది సాయపడుతుంది. రక్తస్రావం ముప్పు లేకుండా చూస్తుంది. ఎముకల బలానికి సైతం మేలు చేస్తుంది. క్యాలీఫ్లవర్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు ఈ పీచు అవసరం. కొలన్ కేన్సర్ నిరోధానికి సైతం ఇది అవసరం. 

ప్రయోజనాలు..
క్యాలీఫ్లవర్ మన శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ముఖ్యంగా కేన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. తక్కువ కేలరీలు, పీచుతో ఉంటుంది కనుక దీంతో అధికంగా ఉన్న బరువు తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలోపేతానికి సాయపడుతుంది కనుక వ్యాధుల నుంచి అధిక రక్షణ లభిస్తుంది.